మరాఠా ఎన్నిక ప్రచారంలో తెలుగు ‘ఆంధీ’
- మహారాష్ట్ర ఎన్డీఏ కూటమి పక్షాన ప్రచారానికి “పవన్ కళ్యాణ్”
- బీజేపీ పెద్దల అభ్యర్ధనను గౌరవించిన ‘జనసేనాని’
- ఈనెల 16, 17 తేదీల్లో పవన్ ప్రచారానికి షెడ్యూల్ ఖరారు
అమరావతి:”యే పవన్ నహీ హై..ఆంధీ హై (అతను గాలి కాదు. తుఫాను).” అని కొద్దినెలల కిందట ఎన్డీఏ ఎంపీల సమావేశంలో ప్రముఖ నటులు, రాజకీయవేత్త, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పరిచయం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికలు – 2024, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసిన అన్ని స్థానాలను గెలుచుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ చారిత్రాత్మక విజయంతో రాజకీయ రంగాన్ని తుఫానుగా తీసుకున్నందున ఉరుములతో కూడిన కరతాళ ధ్వనుల మధ్య ఈ వ్యాఖ్య వచ్చింది. సరిగ్గా ఇప్పుడు అదే పొలిటికల్ పెను (ఆంధీ) తుఫాను అస్త్రంగా మహారాష్ట్ర ఎన్నికల్లోనూ విజయం సాధించాలని ఎన్డీఏ కూటమి (బీజేపీ) పెద్దలు ప్రధాని మోదీ, అమిత్ షా వ్యూహం రచించారు. ఇందులో భాగంగా ఇటీవల ఢిల్లీ టూర్ వెళ్ళిన ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ను మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించారు. తనపై నమ్మకంతో వారు అప్పగించే ఎన్నికల ప్రచార బాధ్యతల అభ్యర్ధనపై మారు మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపారు. వారి ఎన్నికల ప్రచారానికి సైతం షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 16, 17 తేదీల్లో పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. పవన్ ఛరిష్మా అస్త్రంగా..:- మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించనున్నారు.ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ పెద్దలకు, ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు మధ్య వారధిలా పనిచేసిన పవన్ కల్యాణ్ కూటమి ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయ్యారు. అంతేకాకుండా, ఏపీలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వంటి అగ్రనేతలను తీసుకురాగలిగారు. ఇటు, ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఎన్డీఏ విజయదుందుభి మోగించడం, ఏపీలో కూటమి తరపున గెలుపొందిన ఎంపీలు మోదీ సర్కార్ ఏర్పాటులో కీలకం కావడంతో పవన్ కళ్యాణ్ గారి ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలోనే పవన్ ని ‘ఆంధీ'(తుఫాన్) తో పోల్చుతూ ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ క్రమంలోనే ఈ తుఫానును మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవాలని ప్రధాని మోదీ భావించారు.తెలుగు ప్రజల ఆదరణ నేపథ్యంలో..:మహారాష్ట్రలోని తెలుగు వారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ ఈ నెల 16, 17 తేదీల్లో బీజేపీ తరపున ప్రచారం చేయనున్నారు. ఇందుకోసం బీజేపీ సీనియర్ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. మొన్నామధ్య జరిగిన తమిళనాడు ఎన్నికలలోనూ పవన్ కళ్యాణ్ బీజేపీ తరఫున ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ కి ఉన్న సినీ గ్లామర్ తో పాటు సనాతన ధర్మం కోసం పవన్ చేస్తోన్న పోరాటం వంటి విషయాల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఆయన కీలకంగా మారబోతున్నారని జాతీయస్థాయిలో విశ్లేషకుల చర్చ గమనార్హం.