కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట.
కర్నూలులో 100 పడకల ఆసుపత్రికి ప్రతిపాదనలు.
మరో 7 ఆసుపత్రులకు స్థలాలు కేటాయింపు .
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ వెల్లడి.
రామచంద్రపురం .
తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి, తమ గుండెల్లో పెట్టుకుని ఆశీస్సులు అందించిన రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు. అసెంబ్లీ సాక్షిగా, రాష్ట్ర మంత్రివర్గం కొలువుతీరిన నిండు సభ వేదికగా మంత్రి తన ప్రజలపై ఉన్న మమకారాన్ని చాటుకున్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న మంత్రి సుభాష్ మాట్లాడుతూ ప్రజా దేవాలయంగా భావించే అసెంబ్లీలో ప్రజల పక్షాన వాణి వినిపించేందుకు అవకాశం ఇచ్చిన సొంత నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కార్మిక శాఖ ప్రగతి, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పై మంత్రి సుభాష్ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికుల సంక్షేమం, వారికి అమలు చేస్తున్న సంక్షేమంపై దృష్టి సారించామని మంత్రి వివరించారు. కర్నూలులో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని, తణుకులో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. అచ్యుతాపురంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం ఇటీవల శంకుస్థాపన చేశామన్నారు. అలాగే గుంటూరు,పెనుగొండ, నెల్లూరు, శ్రీకాకుళంలో ఆశుపత్రుల నిర్మాణానికి స్థలాలు మంజూరు చేసామన్నారు. ఈఎస్ఐ కార్పొరేషన్ కు అప్పగించిన విజయవాడ దగ్గర లోని గుణదల ఆసుపత్రిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నా మన్నారు. గత వైసిపి పాలనలో రూ.616 కోట్లు నిధులు ఉన్నప్పటికీ కార్మికుల సంక్షేమానికి వినియోగించలేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14 లక్షల 50వేల మంది ఇన్సుర్డ్ పర్సన్స్ ఉన్నారని, ఆ సంఖ్యను 25 లక్షలకు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈఎస్ఐ నిబంధనల ప్రకారం 20 వేల మంది కార్మికులు ఉన్నచోట మాత్రమే 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసే అవకాశం ఉందని, తణుకులో 12,610 మంది మాత్రమే ఉన్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తణుకు పరిసర ప్రాంతాల్లో పలు పరిశ్రమలు, చేపల చెరువులు ఎక్కువగా ఉన్నందున కార్మికుల కోసం ఆ ప్రాంతంలో ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. గత ప్రభుత్వం కార్మిక శాఖను నిర్వీర్యం చేసి, గాలికి వదిలేసిందని మంత్రి సుభాష్ ఎద్దేవా చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు. పదిమంది దాటి పనిచేసే ప్రతి ప్రాంతం కార్మిక శాఖ పరిధిలోకి వస్తుందని, కొన్ని విభాగాల యాజమాన్యాలు కార్మికుల వివరాలు వెల్లడించడం లేదన్నారు. తద్వారా కార్మికులు తమ హక్కులను కోల్పోతున్నారు అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చాలామంది కార్మికులు మృత్యువాత పడ్డారని విచారం వ్యక్తం చేశారు. పూర్వ పరిస్థితి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని మంత్రి సుభాష్ హామీ ఇచ్చారు.బాలలను పనిలో పెట్టుకుంటే వారిపై చట్టపకారం చర్యలు తీసుకుంటామని మంత్రి సుభాష్ హెచ్చరించారు.