లేపాక్షి: శిల్పకళా రామంగా పేరొందిన లేపాక్షి వీరభద్రాలయం తో పాటు మండల పరిధిలోని శివాలయాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలను మహిళలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వీరభద్రాలయంలోని పాపనాశశ్వరుడు, దుర్గాదేవి, వీరభద్ర స్వామి, రామలింగం, హనుమ లింగం లతోపాటు మండల పరిధిలోని బిసల మానేపల్లి , కల్లూరు, కొండూరు, పాత లేపాక్షి పెద్ద చెరువు శివాలయం, తదితర గ్రామాల్లో వెలసిన శివాలయాల్లో మహిళలు ఉపవాస దీక్షతో ఉదయం నుండి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. శైవ సాంప్రదాయ రీతిలో నిర్మించిన లేపాక్షి వీరభద్రలయంలో ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాలకు చెందిన పర్యాటకులు వేలాదిగా తరలివచ్చి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీనరసింహశర్మ, శ్రీనివాస్ కుమారులు స్వామి వార్లకు విశేష పూజలు నిర్వహించారు. కార్తీక దీపాలను వెలిగించారు. భక్తిశ్రద్ధలతో పాపనాశైశ్వర స్వామి, పంచలింగాలను పూజించారు. అదేవిధంగా మండల పరిధిలోని శివాలయాల్లో ఉపవాస దీక్షతో మహిళలు కార్తీకదీపం వెలిగించి శివారాధన చేశారు. లేపాక్షి వీరభద్రాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా రాత్రి జ్వాలాతోరణ పూజను ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహ శర్మ నిర్వహించారు. జ్వాలాతోరణ పూజ వీరభద్రాలయంలో నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లేపాక్షి వీరభద్రాలయంలో జరిగిన కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.