అసెంబ్లీ తీర్మానాన్ని హైకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి పంపుతాం
లోకాయుక్త, హెచ్ఆర్సీ కార్యాలయాల తరలింపు ఉండదు…కర్నూలులోనే ఉంటాయి
యువగళం హామీ మేరకు మిషన్ రాయలసీమను సాకారం చేస్తాం
రాయలసీమ అభివృద్ధికి గత ప్రభుత్వం చీమంత కృషి కూడా చేయలేదు
మూడు రాజధానుల పేరుతో మూడుముక్కలాట ఆడారు
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
శాసన సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం
హైకోర్ట్ బెంచ్ ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం
అమరావతి:-
ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇప్పటికే ఈ అంశంపై కేబినెట్ ఆమోదించిందని, అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని హైకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని అన్నారు. హైకోర్ట్ బెంచ్ ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. లోకాయుక్త, హెచ్ఆర్సీ కార్యాలయాల తరలింపు ఉండదు‘లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కార్యాలయాల తరలింపు ఉండదు, అవి కర్నూలులోనే ఉంటాయి. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఉత్తరాంధ్రలో విశాఖ, సీమలో కర్నూలు, తిరుపతి పట్టణాలను మరింత అభివృద్ధి చేస్తాం. మూడు రాజధానుల పేరుతో గత ప్రభుత్వం మూడు ముక్కలాటలాడి ఏ ప్రాంతం అభివృద్ధి కాకుండా చేశారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మేము విశాఖ, కర్నూలులో కూడా అమరావతే రాజధాని అని ఆ ప్రాంత ప్రజలను ఒప్పించాం. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం. గతంలో చేశాం… మళ్లీ చేసి చూపిస్తాం. రాయాలసీమగా ఎడారిగా మారుతుందని ఆలోచించి కృష్ణా జలాలను సీమకు తరలించాలని ఆలోచించింది ఎన్టీఆర్. ఇందులో భాగంగానే తెలుగుగంగ, హంద్రీనీవా, నగరి గాలేరు ప్రాజెక్టులను ఎన్టీఆర్ ప్రారంభించారు. వాటిని పూర్తి చేసేది కూడా ఎన్డీయేనే. నదుల అనుసంధానం చేసి, పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లను బసకచర్లకు తీసుకెళ్తే గేమ్ ఛేంజర్ అవుతుంది. కియా పరిశ్రమను తీసుకొచ్చేందుకు యేడాదిలోనే గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశాం. కియా రాకతో అనంత జిల్లా ముఖచిత్రం మారిపోయింది. హార్టికల్చర్ అభివృద్ధి చేస్తే మహర్ధశ వస్తుంది. అనంతపురానికి బెంగళూరు ఎయిర్ పోర్టు, కర్నూలుకు హైదరాబాద్ ఎయిర్ పోర్టు, చిత్తూరుకు చెన్నై ఎయిర్ పోర్టులు దగ్గరగా ఉన్నాయి…ఈ మూడు అవకాశాలను అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు. సీమలోనూ మంచి రోడ్లు వచ్చాయంటే టీడీపీ హయాంలోనే. ఓర్వకల్లులో ఎయిర్ పోర్టు పెట్టాం. తిరుపతి ఎయిరో పోర్టును విస్తరించి సర్వీసులు పెంచేలా చేశాం. కడప ఎయిర్ పోర్టులో రాత్రి సమయంలోనూ విమానాలు దిగే అవకాశం కల్పించాం. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో నాలుగు ఎయిర్ పోర్టులు ఉన్నాయి. ఎడ్యుకేషన్ హబ్ గా సీమను మార్చుతాంరాయలసీమలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. తిరుపతిని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చుతున్నాం. తిరుపతి ఐఐటీ, ఐజర్, కర్నూలులో ట్రిపుల్ ఐటీ, ఉర్దూ యూనివర్సిటీ, అనంతపురంలో సెంట్రల్ వర్సీటీ పెట్టి ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చాం. యువగళంలో ప్రకటించిన విధంగా మిషన్ రాయలసీమ హామీలను నెరవేర్చుతాం. హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు 90 శాతం రాయితీతో డ్రిప్ సబ్సీడీ ఇచ్చాం..కానీ గత ప్రభుత్వం దాన్ని కూడా రద్దు చేసింది. మళ్లీ రాయితీతో డ్రిప్ ను రైతులకు అందిస్తాం. గత ప్రభుత్వం రాయలసీమకు చీమంత మేలు కూడా చేయలేదు. తిరుపతి హార్డ్ వేర్ హబ్ గా మారింది టీడీపీ హయాంలోనే. కేంద్రం రెండు ఇండస్ట్రియల్ పార్కులు ఇస్తే వాటిని కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తిలో ఏర్పాటు చేశాం. వీటి అభివృద్ధికి రూ.5 వేల కోట్లు మంజూరయ్యాయి. ఓర్వకల్లును డ్రోన్ హబ్ గా మార్చేందుకు 300 ఎకరాలు కేటాయించాం. కర్నూలను బెస్ట్ సిటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని వివరించారు.