-ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి
-12వ పిఆర్సీ అమలు చేయాలి
ఎస్.టి.యూ సంఘం డిమాండ్
హిందూపురం టౌన్
ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన డిఏలు, 30 శాతం మధ్యంతర భృతిని వెంటనే నూతన సంవత్సర కానుకగా ప్రకటించాలని ఎస్టియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరి ప్రసాద్ రెడ్డి, చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలో ఎస్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,సార్వత్రిక ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్ లో ఉన్న డి ఏ లను, ఐఆర్ ను ప్రకటించాలని, అలాగే గత ప్రభుత్వం నియమించిన 12వ పిఆర్ సి కమిషనర్ రాజీనామా చేసినందున వెంటనే పిఆర్సి కమిషన్ నియమించి, నిర్ణీత కాలపరిమితి లోపు నివేదిక తెప్పించుకుని, వీలైనంత త్వరగా 12వ పిఆర్పి అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరల సూచికకు అనుగుణంగా డి ఎ లను, పి ఆర్ సి ని ప్రకటించి ఉద్యోగులకు ఉపశమనం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. గత కొన్ని దశాబ్దాలుగా కొత్త పిఆర్సి అమలుకు కొంత సమయం తీసుకుంటున్నందున, ఈ లోపు ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐ.ఆర్) ని ప్రకటించే ఆనవాయితీ ఉందని, వాస్తవానికి 12వ పిఆర్సి 1.7.2023 నుండి అమలు చేయాలని అయితే ఇంతవరకు అమలు కాలేదన్నారు. ఇప్పటికే ఒకటిన్నర సంవత్సరం ఆలస్యమైందని,ఈ విధంగా ప్రతి పిఆర్సి అమలు ఆలస్యమౌతున్నందున ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆంధ్రన వ్యక్తం చేశారు. దసరా, దీపావళి కానుకగా డి ఎ, పి అర్ సి ప్రకటన ఉంటుందని ఆశించిన ఉద్యోగులకు నిరాశే మిగిలిందన్నారు. వెంటనే నూతన సంవత్సర కానుకగా 30% మధ్యంతర భృతిని, పెండింగ్ డిఎ లను ప్రకటించి నష్ట నివారణ చర్యలు చేపట్టాలన్నారు. 11వ పీఆర్సీ అమలు సందర్భంలో జరిగిన నష్టాన్ని, లోపాలను ఈ పీఆర్సీ లో సరిదిద్ది న్యాయం చేస్తారని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారని తెలిపారు. జిల్లా ఆర్థిక కార్యదర్శి గోపాల్ నాయక్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్ల కొరత అధికంగా ఉందని, వెంటనే సబ్జెక్ట్ టీచర్లను నియమించాలని డిమాండ్ చేశారు. ఆగిన మున్సిపాలిటీ పదోన్నతుల ప్రక్రియ రీ షెడ్యూల్ విడుదల చేసి పదోన్నతులకు చేపట్టాలని కోరారు . 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని,
117 జీవోను రద్దు చేయాలని, సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పాఠశాల స్థాయిలో వివిధ రకాల యాప్ లోను రద్దు చేసి ఉపాధ్యాయులను బోధనకు పరిమితం చేయాలని, పని సర్దుబాటు ప్రక్రియలోని అసంబద్ధాలను తొలగించాలని,1998, 2008 డిఎస్సి ఎంటిఎస్ ఉపాధ్యాయులకు 62 సంవత్సరాల పదవీ విరమణ వయసు పెంచి రెగ్యులర్ ప్రాతిపదికన నియామకం చేపట్టాలని, కేజీబీవీ టీచర్లకు ఎంటిఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ మండల అధ్యక్షులు షమీవుల్లా, ప్రధాన కార్యదర్శి గంగాధర్, ఆర్థిక కార్యదర్శి రాము తదితరులు పాల్గొన్నారు.