సొంత నిధులు వెచ్చించిన ఎమ్మెల్యే బాలకృష్ణ.
పనులను పరిశీలించిన ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి.

లేపాక్షి: మండల కేంద్రమైన లేపాక్షికి సమీపంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో పలు భవనాలు మరుగుదొడ్ల బ్లాక్ లకు సంబంధించిన మరమ్మతులకు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ సొంత నిధులను వెచ్చించారు. దాదాపు పనులన్నీ పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి డాక్టర్ సురేంద్ర, హిందూపురం నియోజకవర్గం టిడిపి కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, వ్యక్తిగత సహాయకులు బాలాజీ, టిడిపి మండల కన్వీనర్ జయప్ప తదితరులు బుధవారం పనులను పరిశీలించారు. నాలుగు టాయిలెట్ బ్లాక్లలో గదుల పై భాగాన్ని తొలగించి నూతనంగా నిర్మించారు. అదేవిధంగా బేసిన్లు, వాకిళ్ళు, ఫ్లోరింగ్ బండలు, వాటికి రంగులను వేయించడం జరిగింది. విద్యార్థుల నివాస గృహంలోని మంచాలకు రంగులు వేయించడంతోపాటు కిటికీలకు దోమతెరలు వేయించారు. అదేవిధంగా వేడి నీటి కోసం సోలార్ పంపులను బిగించారు. సెప్టిక్ ట్యాంకులను శుభ్రపరచడంతో పాటు వాటికి మరమ్మతులు చేయించారు. ఈ పనులకు దాదాపు 40 లక్షల రూపాయలు వ్యయమైనట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి డాక్టర్ సురేంద్ర పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి మరింత సహకారం అందించే విధంగా ఎమ్మెల్యే బాలకృష్ణతో చర్చిస్తానని ఆయన తెలిపారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ సుందర్రాజు శ్రీనివాసరావు దృష్టికి మరికొన్ని సమస్యలను తీసుకువచ్చారు. ప్రస్తుతం డార్మెంటరీ ముందు భాగంలో గుంతల మయంగా ఉందని ఆ గుంతలకు మట్టిని తోలే విధంగా తమను సహకరించాలని కోరారు. అదేవిధంగా డైనింగ్ హాల్ వర్షాకాలంలో కారుతోందని వెంటనే డార్మెంటరీ పై భాగానికి అవసరమైన మరమ్మతులు చేసే విధంగా సహకరించాలని కోరారు. వెంటనే నియోజకవర్గ టిడిపి కోఆర్డినేటర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ విషయాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు బాలాజీ, టిడిపి నాయకులు ఆనంద్ కుమార్, రామాంజి నమ్మ, సిటీ ఆంజనేయులు, సర్పంచ్ సిద్ధార్థ, డిష్ మంజు, నరసింహమూర్తి, ఉపాధ్యాయులు జయసింహ నాయుడు, కార్యాలయ నిర్వాహకులు ముస్తఫా లతోపాటు పలువురు పాల్గొన్నారు.