- తెలుగు భాషాభివృద్ధికి మన వంతు కృషి చేయాలి
- జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వీ.
- కలెక్టరేట్లో అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళి

అనంతపురము
మన ఊరు, మన రాష్ట్రం, మన భాష పైన ప్రతి ఒక్కరికి అభిమానం ఉండాలని, తెలుగు భాషాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వీ. అన్నారు.
అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మతో కలసి జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జీవితంలో దానాలలో గొప్పదానం ప్రాణదానమన్నారు. మనం సహజంగా ఆకలిగా ఉన్న వ్యక్తికి అన్నం పెడితే మనం సంపాదించిన డబ్బు నుంచి వస్తుంది కాబట్టి, దానిని మరలా మనం సంపాదించుకోవచ్చని, విద్యాదానం మనకు తెలిసినది ఒకరికి చెబితే వారు దాన్ని నేర్చుకొని అభివృద్ధి చెంది దానివల్ల పోగొట్టుకునేది ఏమీ ఉండదని, అదేవిధంగా ప్రాణాన్ని పోగొట్టుకుంటే అది మరల తిరిగి రాలేనిదని.. దాని తర్వాత మిగిలేది ఎవరికి కూడా ఏమీ తెలియదని, అలా దానాలలో ప్రాణదానం చాలా గొప్ప విషయమని.. ప్రపంచంలో ఎవరైనా ఉద్దేశం, ఒక లక్ష్యం కోసం వారి ప్రాణాన్ని త్యాగం చేస్తే వారు మహాత్ములుగా పిలవబడుతారని తెలిపారు. మన భారతదేశంలో స్వాతంత్రం కోసం భగత్ సింగ్ లాంటి వారు, మన ఆంధ్ర రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు చేసిన ఆత్మార్పణం ప్రతి ఒక్క ఆంధ్రుడు గుర్తుంచుకోవాల్సిన విషయమన్నారు. దీనిని స్టేట్ ఫంక్షన్ గా నిర్వహించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జీవోను విడుదల చేసిందని, ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో జరుపుకోవాలని చెప్పడం చాలా సంతోషించదగ్గ, గర్వించదగ్గ విషయమన్నారు.
గతంలో నేను నెల్లూరు జిల్లాలో పని చేయుచున్న సమయంలో చాలామంది ఉదయాన్నే మద్రాస్ కు వెళ్లి సాయంత్రానికి తిరిగి నెల్లూరుకు చేరుకునేవారని, అలాగే నెల్లూరు తమిళంలో కూడా మాట్లాడేవారని, అలాగే మద్రాసుల్లో కూడా చాలా మంది తెలుగు వారు ఉన్నారని తెలుగు మాట్లాడేవారని, మొన్న జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ పోటీలలో గెలిచినటువంటి గుకేష్ దొమ్మరాజు తెలుగు వాడేనని గుర్తు చేశారు.గతంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో పనిచేసే చాలామంది తెలుగు భాష మాట్లాడే అధికారులు ఉండేవారన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వివిధ భాషలు మాట్లాడేవారికి, వారి పరిపాలన సౌలభ్యం కోసం ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చిందని, ఆ విధంగా వివిధ రాష్ట్రాలు ఏర్పడ్డాయని, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడలేదని, దీనిని పరిశీలించిన పొట్టి శ్రీరాములు తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్దేశంతో ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటుకు ప్రాణ త్యాగాన్ని చేశారని గుర్తు చేశారు. అలాగే దళితులను పవిత్ర స్థలాలైన దేవాలయాలలోకి ప్రవేశం కొరకు పోరాటం చేశారన్నారు. ఇలాంటి త్యాగాల ఫలితమే మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి కారణమైందని, ఈనాడు దళితులను దేవాలయాలలో ప్రవేశాలు, పూజారులుగానూ ఉన్నారని, వారు సాధించిన ఫలితాన్ని ఇంకా అభివృద్ధి చేసేందుకు ఈరోజు మన ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్- 2047 దిశగా అడుగులు వేస్తున్నదని అన్నారు. ఈ సందర్భంగా వారిని గుర్తుంచుకోవడం వారి పేరున పొట్టి శ్రీరాములు జిల్లాను ఏర్పాటు చేసుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా మనమందరం తెలుగులోనే మాట్లాడే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలని, వివిధ భాషలను నేర్చుకున్న కూడా మన పిల్లలకు భావితరాల వారికి తెలుగు మాట్లాడడం, రాయడం నేర్పించాలని, మన గ్రామాలలో, జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలలోని సందర్శించాలని, వాటి గొప్పతనాన్ని నలుమూలల వ్యాప్తి చెందే విధంగా చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మన ఊరు, రాష్ట్రం, భాష పైన ప్రతి ఒక్కరికి అభిమానం ఉండాలని , అదేవిధంగా వాటిని అభివృద్ధి చెందినందుకు మన వంతు కృషి చేయాలన్నారు. ఆ విధంగా చేస్తేనే పొట్టి శ్రీరాములు గారికి సంతృప్తి, ఆత్మశాంతి కలుగుతుందని దృఢంగా నమ్ముతున్నానని అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ.. మనందరం దేనినైనా సాధించాలనే దృఢ సంకల్పం ఉంటే దేనినైనా సాధించవచ్చని పొట్టి శ్రీరాములు అందుకు నిదర్శనమని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర కోసం దాదాపు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తాను ఆత్మార్పణ చేసుకొని మనకు అంతరాష్ట్రాన్ని తీసుకొచ్చారన్నారు. భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత అందరిలాగా మన తెలుగు వారికి మాత్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక పోవడంతో పొట్టి శ్రీరాములు పోరాటం చేశారన్నారు. పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితులై క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరుగా నిలుస్తూ వారితో పలు ఉద్యమాలలో పాల్గొని తెలుగు జీవితాన్ని కూడా అనుభవించి మనకు విజయాలను అందించారని, అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడున్నటువంటి పిల్లలందరూ చదువులో మీకు గమ్యాన్ని చేరుటకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని లెక్కచేయకుండా ముందుకు సాగాలని, మీరు అనుకున్న లక్ష్యాలను, గమ్యాన్ని చేరేందుకు పట్టుదలతో కృషి చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుండి అందే పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతపురం, సింగనమల బీసీ కాలేజ్, హాస్టల్ విద్యార్థినులు పలు సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. వారికి జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్మన్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డిఆర్ఓ ఏ.మాలోల, కలెక్టర్ కార్యాలయం ఏ ఓ అలెగ్జాండర్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇన్చార్జి డిడి సుభాషిని, డిటిడబ్ల్యూఓ రామాంజనేయులు, ఐసీడీఎస్ ఏపీడీ వనజా అక్కమ్మ, కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ యుగేశ్వరి, ఈ సెక్షన్ సూపరింటెండెంట్ రియాజుద్దీన్, మెజిస్టీరియల్ విభాగం సూపరింటెండెంట్ వసంతలత, కలెక్టరేట్ లోని వివిధ విభాగాల సూపరింటెండెంట్, ఉద్యోగులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.