న్యూఢిల్లీ:పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు అత్యంత ఆత్మీయురాలు… కొన్నిసార్లు మా పార్టీ నేతలు ఏదేదో మాట్లాడుతుంటారు… వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆయన అసోంలో ఉన్నారు. మమతా బెనర్జీపై కాంగ్రెస్ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసి రాహుల్ గాంధీ స్పందించారు.
బెంగాల్‌లోని 42 లోక్ సభ స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను నిలబెట్టే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగింది. ఈ ప్రచారంపై అధిర్ రంజన్ చౌదరి స్పందిస్తూ… మమతా బెనర్జీ అవకాశవాది అని విమర్శించారు. మమత కారణంగా తాము ఎన్నికల్లో ఓడిపోయామని, సొంత బలంతో పోటీ చేసి గెలవడం తమ పార్టీకి తెలుసునని వ్యాఖ్యానించారు. మా పార్టీ అధికారంతోనే ఆమె గద్దెనెక్కారనే విషయం గుర్తించాలన్నారు. అధిర్ రంజన్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు.