రాష్ట్రంలో మరో 75 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోందని సీఎం జగన్ అన్నారు. ఈ ఎన్నికల్లో అబద్దానికి, నిజానికి మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీ పాలనలో జరిగిన మంచిని వివరించాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సంగివలసలో సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… భీమిలిలో ఇవాళ తనకు అటు సముద్రం, ఇటు జన సముద్రం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. సభకు వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ ఒక్కో సేనాధిపతి కనిపిస్తున్నారని అన్నారు.
వచ్చే ఎన్నికలకు ప్రతిపక్షాలు పద్మవ్యూహం పన్నుతున్నారు..ఈ పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉంది అభిమన్యుడు కాదు…. అర్జునుడు అన్నారు. ఈ అర్జునుడికి కృష్ణుడి లాంటి ప్రజలు తోడున్నారన్నారు. వచ్చే ఎన్నికలు కౌరవులు, పాండవుల మధ్య యుద్ధం లాంటిదన్నారు. ఈ యుద్ధంలో వైసీపీ 175 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
గత ఎన్నికల్లో మేం ప్రకటించిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలు నెరవేర్చాం. చంద్రబాబు ఇచ్చిన 650 హామీల్లో 10 శాతం కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు చెప్పండి… ఎవరిది విశ్వసనీయత? చంద్రబాబు ఏం చేశాడో చెప్పడానికి ఏమీ లేదు. చేసిందేమీ లేదు కాబట్టి చెప్పుకోలేడు. కానీ, మీ బిడ్డ చేసిన మంచినే నమ్ముకున్నాడు… ప్రజలు ఉన్నారన్న ధైర్యంతోనే మీ బిడ్డ ఎన్నికలకు వెళుతున్నాడు.
“చంద్రబాబుకు ఎప్పుడూ కూడా ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. అందుకే దత్తపుత్రుడ్ని తోడు తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి 23 స్థానాలు వచ్చాయి… ఈసారి అవి కూడా రావు. ఈ ఎన్నికల యుద్ధం అబద్ధానికి, నిజానికి మధ్య జరుగుతుంది. మోసానికి, నిజాయతీకి మధ్య జరుగుతుంది.
రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం గురించి ఆలోచించిన పార్టీ వైసీపీనే. సామాజిక న్యాయం అంటే ఏమిటో చేసి చూపించాం. గ్రామగ్రామానికి డిజిటల్ లైబ్రరీలు, బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం తీసుకువచ్చాం.దిశ యాప్ తో మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం. రైతులకు సున్నా వడ్డీ రుణాలు, ఉచిత్ విద్యుత్ అందిస్తున్నాం. రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు చేశాడా… నిండా ముంచాడు! 3,527 చికిత్సలతో ఆరోగ్య శ్రీని మరింత విస్తరించాం. వైద్య ఆరోగ్య రంగంలో 50 వేల పైచిలుకు ఉద్యోగ నియామకాలు జరుపుతున్నాం.
‘ఎక్కడా వివక్ష లేకుండా ఒకటో తేదీన ఉదయాన్నే పెన్షన్ అయినా, పౌర సేవలైనా, ఏ పథకమైనా గడపకు అందించిన ప్రభుత్వం మాది. రైతలన్నల కోసం ఆర్బీకే వ్యవస్థ ఏర్పాటు చేశాం. విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ ఇంటింటినీ జల్లెడపట్టి ఆరోగ్య సురక్ష అందించాం. ప్రభుత్వ బడిని నాడు నేడుతో విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంతో పాటు ట్యాబ్స్ ఇచ్చాం. మహిళా పోలీస్ ను, దిశా యాప్ ను ఒక్క బటన్ నొక్కితే అక్కాచెల్లెమ్మల రక్షణ కోసం పోలీసులు చేరుకుని, ఏం జరిగిందని వాకబు చేసే వ్యవస్థను తీసుకొచ్చాం. డిజిటల్ లైబ్రరీలు, ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ లు ఏర్పాటు చేసి మార్పులు తీసుకొచ్చాం. ఈ మార్పులు ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు కనిపిస్తాయని’ ఏపీ సీఎం జగన్ అన్నారు.
చంద్రబాబు ఇచ్చిన 650 హామీల్లో కనీసం 10 శాతం కూడా నెరవేర్చలేదని సీఎం జగన్ ఆరోపించారు. వైసీపీ సర్కార్ దాదాపు అన్ని హామీలను నెరవేర్చిందన్నారు. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకూ చంద్రబాబు చేసేందేమీ లేదని.. టీడీపీ ఏం చేసిందో చెప్పడానికి ఏమీ కనిపించదన్నారు. 56 నెలల కాలంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాం.వివక్షకు తావు లేకుండా ప్రభుత్వ పథకాలను అమలు చేసిన ఘనత తమదేనన్నారు.