తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
టీ డీ పీ కన్వీనర్ జయప్ప
లేపాక్షి ఆలయ ఘన చరిత్ర ప్రపంచానికి చాటి చెప్పేందుకు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ‘ఆయన డ్యాన్స్ కంపెనీ’ నేతృత్వంలో సాంస్కృతిక నృత్య ప్రదర్శన ఫిబ్రవరి 4న వీరభద్రాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు మండల టిడిపి కన్వీనర్ జయప్ప పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రమైన లేపాక్షి లోని ఆర్ జె హెచ్ ఫంక్షన్ హాల్ లో టిడిపి కన్వీనర్ జయప్ప, నాయకులు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కన్వీనర్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు వీరభద్రాలయ ప్రాంగణంలో ఆయన డాన్స్ కంపెనీ నృత్యకారులు సాంస్కృతిక నృత్యాలను ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీ పాలనలో నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన నంది ఉత్సవాల కారణంగానే లేపాక్షి ఆలయ ఘన చరిత్ర ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందిందన్నారు .లేపాక్షి పంచాయతీకి ఆదాయం పెరిగిందన్నారు. ఆలయ చరిత్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం పొందిందన్నారు. ఆ ఆలయ చరిత్ర ఎవరు మరచిపోకుండా ఉండేందుకే సాంస్కృతిక నృత్య కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ ఏర్పాటు చేశారని తెలిపారు. లేపాక్షి ఆలయ చరిత్ర ప్రపంచానికి చాటుదామని జయప్ప పేర్కొన్నారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కు ఎమ్మెల్యే బాలకృష్ణ కృషి చేస్తున్నారన్నారు. కనుమరుగవుతున్న ప్రాచీన కళలను పునరుద్ధరించడంలో భాగంగా లేపాక్షిలో సాంస్కృతిక నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అంతేకాక లేపాక్షి మండలంలో రాజ్యసభ సభ్యులు కనకమేడల రవి నిధులతో నియోజకవర్గంలో మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. లేపాక్షి మండల పరిధిలో కంచి సముద్రంలో ఐదు లక్షలు, నాయన పల్లిలో ఏడు లక్షలు, కొండూరులో నాలుగు లక్షలు, మైదు గోళంలో ఐదు లక్షలు, లేపాక్షి లో మూడు లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పనులను చేస్తుంటే దానిని చూసి ఓర్వలేక వైకాపా నాయకులు అడ్డు తగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్సార్ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. వైకాపా నాయకులు అభివృద్ధి చేయకపోగా టిడిపి నాయకులు చేస్తున్న అభివృద్ధి పనులకు అడ్డు తగులుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు నాగలింగారెడ్డి, చంద్ర శేఖర్ గౌడ్, బయన్నపల్లి రవి, ఈడిగ రమేష్, షేక్షావలి , సిటీ ఆంజనేయులు, గంగిరెడ్డి, అన్నప్ప, డిష్ మంజు, బుల్లెట్ రవి లతోపాటు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.