హిందూపురం టౌన్
రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి ఇంటర్నెట్ అనే బృహత్తర కార్యక్రమం తో ముందుకు సాగుతున్నదని, అందుకు అనుగుణంగా ఆపరేటర్లు ముందుకు సాగాలని ఏపీ ఫైబర్ మార్కెటింగ్ మేనేజర్ ప్రసాద్ సూచించారు. బుధవారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో పట్టణ వ్యాప్తంగా ఉన్న ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్, మార్కెటింగ్ మేనేజర్ ధనుంజయ్ మాట్లాడుతూ ఫైబర్ నెట్ ద్వారా వినియోగదారులకు కేవలం రూ.190లకే ఇంటర్నెట్ ప్యాకేజీ ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇంత తక్కువ ధరలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని వినియోగదారులకు ఇతర ఏ సంస్థలు అందించ లేవన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించాల్సిన బాధ్యత ఆపరేటర్ల పై ఉందన్నారు. ఏపీ ఫైబర్ పై ప్రజలకు చైతన్య పరిచి సంస్థ అభివృద్ధికి సహకరించాలన్నారు. ఈ సమావేశంలో ఆపరేటర్లు మహేష్, శివ, శివ శంకర్, వెంకటేష్, ప్రశాంత్, అశోక్ తో పాటు పరిగి, లేపాక్షి, సోమందేపల్లి, రొద్దం తదితర మండలాలకు చెందిన ఆపరేటర్లు పాల్గొన్నారు.