13 వ వర్ధంతి సభలో పలువురి నివాళి!
మామిడి శెట్టి శ్రీరాం ప్రసాద్ కు ఉత్తమ జర్నలిస్ట్ పురస్కార ప్రదానం!
బుట్టాయగూడెం.
పత్రికారంగానికి, సమాజానికి యద్దనపూడి సూర్యనారాయణ మూర్తి చేసిన బహుముఖ సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు నివాళులు అర్పించారు.
తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్, ఏ.పి.యు.డబ్ల్యు.జే. పశ్చిమ గోదావరి జిల్లాశాఖ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం మండల పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తమ్మిసెట్టీ రంగసురేష్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రంగస్థల, కళా పరిషత్తుల సమాఖ్య అధ్యక్షుడు బుద్ధాల వెంకట రామారావు మాట్లాడుతూ పాత్రికేయుడిగా, సామాజిక కార్యకర్తగా, కళాసేవకునిగా యద్దనపూడి చేసిన బహుముఖ సేవలు చిరస్మరణీయమన్నారు.
ఆయన పాటించిన వృత్తి విలువలను , సేవాస్ఫూర్తిని నేటితరం పాత్రికేయులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఆయన కన్నుమూసి పదమూడేళ్ళు గడిచినా ఆయన జయంతులు వర్ధంతులు నిర్వహిస్తూ ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారాలు ఇవ్వడం అభినందనీయమని అన్నారు.సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చింతకాయల బాబూరావు మాట్లాడుతూ యద్దనపూడి పత్రికా రచనకే పరిమితం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడారని, అవసరమైతే అధికారులను, ప్రజా ప్రతినిధులను నిలదీసి ప్రశ్నించేవారని అన్నారు. యద్దనపూడి ఉన్నారంటే , అధికారులు, నేతలు భయపడే వారన్నారు.
త్యాగరాజ గానసభ అధ్యక్షుడు గరికపాటి బాపయ్య శర్మ మాట్లాడుతూ 1957 లో లలిత కళాసమితి స్థాపన ద్వారా ఉద్దండులైన సంగీత విద్వాంసులను తాడేపల్లిగూడెం తీసుకు వచ్చిన ఘనత యద్దనపూడి కి దక్కుతుందన్నారు.
ఏ.ఐ.టి.యు.సి.ఏరియా కమిటీ కార్యదర్శి ఓసూరి వీర్రాజు మాట్లాడుతూ ఆర్టీసీ సేవలను మెరుగుపరచడంలో యద్దనపూడి విశేషకృషి చేశారని అన్నారు.
ఐ.జే.యు. జాతీయ కార్యదర్శి డి. సోమసుందర్ మాట్లాడుతూ యద్దనపూడి పేరిట జిల్లాస్థాయి ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారాన్ని గత పన్నెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రదానం చేయడానికి యద్దనపూడి కుటుంబసభ్యులు అందిస్తున్న సహకారం కీలకమని అన్నారు.విధి నిర్వహణలో విశేషకృషి చేస్తున్న విలేఖరులకు యద్దనపూడి అవార్డు చక్కని ప్రోత్సాహాన్ని , స్ఫూర్తిని ఇస్తున్నదన్నారు.రాష్ట్రంలో ఒక పాత్రికేయుని పేరిట అవార్డు ప్రదానం చేస్తున్న కార్యక్రమాన్ని పుష్కరకాలంగా కొనసాగిస్తున్న ఘనత తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ కు, ఏ.పి.యు.డబ్ల్యు.జే. జిల్లాశాఖకు దక్కుతుందని, అది తాడేపల్లిగూడెం పాత్రికేయులకు గర్వకారణమని అన్నారు. ఇటీవల కన్నుమూసిన ఎలక్ట్రానిక్ మీడియా విలేఖరి
గంధం సురేష్ పేరిట ఉత్తమ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు పురస్కారాన్ని కూడా తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గత సంవత్సరం ప్రవేశ పెట్టడం జరిగిందని , ఆ అవార్డుకు కూడా గుర్తింపు తీసుకు వస్తామని అన్నారు.
ఏ.పి.యు.డబ్ల్యు.జే. రాష్ట్ర నాయకుడు జి.వి.ఎస్.ఎన్.రాజు, జిల్లా కార్యదర్శి గజపతి వరప్రసాద్, జిల్లా కోశాధికారి ముత్యాల శ్రీనివాస్,
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తమ్మిసెట్టి రంగ సురేష్, కార్యదర్శి గొలిమే బుజ్జిబాబు, ప్రెస్ క్లబ్ పూర్వాధ్యక్షులు చిక్కాల రామకృష్ణ, సీనియర్ పాత్రికేయుడు చిట్యాల రాంబాబు , పాలడుగు సతీష్, భీమవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కడలి వరప్రసాద్ , యద్దనపూడి తనయుడు యద్దనపూడి సుబ్బారావు, యద్దనపూడి కుమార్తె వై.వి.ఆర్.లక్ష్మి , తదితరులు యద్దనపూడి సేవలను కొనియాడుతూ నివాళులు అర్పించారు.యద్దనపూడి సూర్యనారాయణ మూర్తి స్మారక ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారాన్ని 2023 వ సంవత్సరానికి గాను బుట్టాయిగూడెం న్యూస్ టుడే విలేఖరి మామిడిసెట్టి శ్రీరాం ప్రసాద్ కు అతిథులు బుద్ధాల వెంకటరామారావు , చింతకాయల బాబూరావు చేతులమీదుగా అందచేసారు. అవార్డు కింద రూ. 5116 నగదు పారితోషికం , జ్ఞాపిక , నూతన వస్త్రాలు, శాలువా, పూలమాలలతో సత్కరించారు.
యద్దనపూడి పేరిట సీనియర్ పాత్రికేయులకు చేస్తున్న గౌరవ సత్కార కార్యక్రమంలో భాగంగా రత్నగర్భ సంపాదకుడు పి.వి. ఏ.ప్రసాద్ (ఏలూరు) ఆంధ్రజ్యోతి విలేఖరి వి. నాగేశ్వర లింగమూర్తి (భీమవరం) విశాలాంధ్ర విలేఖరి ఐతా సురేష్ (కుక్కునూరు) కు జ్ఞాపిక ,శాలువా , నూతన వస్త్రాలు, పూలమాలలతో సన్మానించారు. తాడేపల్లిగూడెం , పాలకొల్లు , భీమవరం , బుట్టాయిగూడెం , వీరవాసరం ,ప్రెస్ క్లబ్ ల తరపున కూడా అవార్డు గ్రహీతలను, గౌరవ సత్కార గ్రహీతలను సన్మానించారు. పలువురు పాత్రికేయులు , అభిమానులు పూలమాలలు బొకేలతో అభినందించారు. సత్కార గ్రహీతలు మాట్లాడుతూ యద్దనపూడి పేరిట తమకు దక్కిన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ బాలికల పాఠశాల 2023 మార్చ్ లో జరిగిన పదో తరగతి పరీక్షల్లో టాపర్ గా నిలిచిన అలేఖ్యకు యద్దనపూడి కుమార్తె వై.ఎన్.వి.ఆర్. పద్మావతి తమ తల్లి తండ్రుల జ్ఞాపకార్థం రూ.5116 రూపాయల నగదు పారితోషికం,జ్ఞాపిక, నూతన వస్త్రాలు, శాలువా, పూలమాలలతో సన్మానించారు. ముందుగా తాలూకా ఆఫీస్ సెంటర్లో యద్దనపూడి విగ్రహానికి బుద్ధాల వెంకట రామారావు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఐజేయు జాతీయ కార్యదర్శి డి .సోమసుందర్ , మునిసిపల్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు పి.పాపారావు, జి.ఎస్.శర్మ , పాత్రికేయులు, కుటుంబసభ్యులు , పూలమాలలు వేసి యద్దనపూడి జోహార్ అంటూ నివాళులు అర్పించారు.