బావిలోకిదూసుకెళ్లిన వాహనం – ఇద్దరు వ్యక్తులు మృతి
మహారాష్ట్రకు చెందిన అరటికాయల వ్యాపారస్తు లగా గుర్తింపు
పులివెందుల(లింగాల)
వైయస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం ఇప్పట్ల గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం బావిలోకి దూసుకెళ్ళడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వీరిని మహారాష్ట్ర వాసులుగా పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాద సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రకు చెందిన సుశీల్ కుమార్ కిల్వాని, ప్రకాష్ బూర టాగూర్ అను ఇరువురు అరటికాయల వ్యాపారులు బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో పార్నపల్లె నుంచి పులివెందుల బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం ఇప్పట్ల గ్రామ సమీపంలో ఉన్న లీలావతి వృద్ధా శ్రమం సమీపంలోనిరోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఇక మరో 15 నిమిషాల్లో పులివెం దుల చేరుకుంటామని పులివెందులలో ఉంటున్న వ్యాపారులకు చరవాణి ద్వారా కిల్వాని, ఠాగూర్ లు తెలియజేశారు. చెప్పిన సమయానికి ఇరువురు వ్యాపారులు పులివెందుల చేరుకోలేదు.15 నిమి షాల్లో చేరుకుంటామని చరవాణి ద్వారా తెలియ జేసిన వారు ఒకసారి వారికి ఫోన్ చేయడంతో స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన పులివెందుల వ్యాపారులు వారు బయలుదేరిన రోడ్డు వెంబడి గమనించుకుంటూ వెళ్తుంటే ఇప్పట్ల సమీపంలో బావి ప్రహరీ గోడ కొద్ది భాగం పడిపోవడం వారు గమనించారు. వాహనం అధువు తప్పి బావిలో పడిందేమో అన్న కోణంలో అక్కడే ఉన్న బావిలోకి తొంగి చూడగా అరటికాయ లోడింగ్ కు వాడే ఫోమ్ (తెల్లటి పేపర్) తేలాడుతు న్న విషయాన్ని గమనించి, కారు ప్రమాదానికి గురై బావిలో పడిపోయిందేమోనన్నా అనుమానంతో లింగాల స్టేషన్ కు తెలియజేశారు. దీంతో లింగాల పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మునిగి ఉన్న కారును గమనించారు. ఆ తర్వాత యంత్రాల సాయంతో వాహనాన్ని బయటకు తీశారు. అప్పటికే కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.