Monday, April 21, 2025

Creating liberating content

తాజా వార్తలుఉపయోగంలేని మధ్యంతర బడ్జెట్

ఉపయోగంలేని మధ్యంతర బడ్జెట్

  • ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ?
  • ప్రత్యేక హోదా మాటేమిటి!
  • విశాఖ రైల్వే జోన్ కు 53 ఎకరాలు కేటాయింపేదీ?
  • సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ ధ్వజం

అనంతపురము
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ లోపభూఇష్టంగా ఉందని, బీజేపీ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఏ ఒక్కటీ అమలు జరిగే పరిస్థితి లేకుండా పోయిందని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ లో ఆ పార్టీ నాయకులతో కలసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాఫర్ మాట్లాడుతూ, ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో ఎవ్వరికీ ఉపయోగం లేని మధ్యంతర బడ్జెట్ ను కేంద్రం ప్రవేశ పెట్టడం సిగ్గుచేటన్నారు. బీజేపీ పాలనలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 25 వేల కోట్ల మంది ఉన్నత స్థితికి వచ్చారని సాక్షాత్తు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు.
ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం… ఈ పదేళ్ళ కాలంలో ఇవ్వాల్సిన 20 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత బడ్జెట్లో రూ.60 వేల కోట్లు ప్రవేశ పెట్టారని, బడ్జెట్ లో ఏ విధమైన మార్పు లేకపోవడం దారుణమన్నారు.
రాష్ట్రానికి ప్రధానమైన ప్రత్యేక హోదా ఊసే లేదని దీంతో నూతన పరిశ్రమలు,90 శాతం సబ్సిడీలు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పూర్తిగా రానట్లేనని మండిపడ్డారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన విభజన చట్టంలో ఉన్న హామీలు తుంగలో తొక్కినట్లేనని విమర్శించారు. జిల్లాకు 50 కోట్లు చొప్పున మూడేళ్లు మాత్రమే ఇచ్చారని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి చెందాలంటే ప్రతి జిల్లాకు 2 వేల కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇచ్చి విభజన చట్టంలో ఉన్న హామీలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 25 మంది ఎంపిలను ఇవ్వండి కేంద్రం మెడలు వంచి విభజన హామీలు సాధిస్తానని గత ఎన్నికల ప్రచారంలో నమ్మించి ఓట్లు దండుకున్న జగన్ మోహన్ రెడ్డి నేడు 31 మంది ఎంపీలు ఉన్నా పార్లమెంటు ముందు గడ్డి కూడా పీకలేక పోతున్నాడని ధ్వజమెత్తారు. సిఎం జగన్ తనపై ఉన్న సీబీఐ కేసుల నుంచి బయట పడడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీజేపీ ప్రభుత్వానికి తాకట్టు పెట్టాడని విరుచుకు పడ్డారు. విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం 53 ఎకరాలు కేటాయించి ఉంటే విశాఖ రైల్వే జోన్ అమలు పరిచే వాళ్ళమని సాక్షాత్తు కేంద్ర మంత్రి చెప్పడంతో రాష్ట్రాభివృద్ధిపై సిఎం జగన్ కు ఎలాంటి బాధ్యత ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఐదేళ్ల కాలంలో రైల్వే జోన్ ఏర్పాటుకు 53 ఎకరాలు ఇవ్వలేకపోయిన సిఎం జగన్ అదే విశాఖలో అంబానికి వందల ఎకరాలు కట్టబెట్టాడని ఏకరువు పెట్టారు. సీఎం జగన్ చెల్లి షర్మిల,తల్లి సునీత ల ఇంటి పోరు ఎక్కువై రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం లేదని, ఇలాంటి ముఖ్యమంత్రి అవసరం లేదని ఘాటుగా విమర్శించారు. జగన్ హాయాంలో రాష్ట్రంలో అభివృద్ధి ఏమాత్రం లేకపోగా ప్రయోజనాలన్నింటిని కేంద్రానికి తాకట్టు పెట్టాడని విచారం వ్యక్తంచేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించిన సెంట్రల్ యూనివర్సిటీ, బెల్ కంపెనీలకు సరిపడా భూమి మంజూరైనా అవి వెనక్కు వెళ్ళడం వైసీపీ ప్రభుత్వ చేతకాని తనమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు నారాయణ స్వామి, మల్లికార్జున, కార్యవర్గ సభ్యులు రాజా రెడ్డి,కేశవరెడ్డి, శ్రీరాములు, రాజేష్ గౌడ్, సీపీఐ నగర కార్యదర్శి అల్లిపీర, ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి కృష్ణుడు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article