నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ జెట్టి గుర్నాధరావు
బుట్టాయగూడెం.
రాష్ట్రంలో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకొని కొన్ని పార్టీలు అధికారంలోకి వచ్చినప్పటికీ, ప్రజల హృదయాల్లో కాంగ్రెస్ పార్టీదే ఎప్పటికీ సుస్థిరమైన స్థానమని నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి జెట్టి గుర్నాధరావు అన్నారు. స్థానిక డిసిసిబి కళ్యాణ మండపంలో శనివారం మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం మండల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మద్దిపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గురునాధరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రాజనాల రామ్మోహన్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు,తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో కొన్ని ఏళ్లుగా నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా షర్మిల రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై చర్చ మొదలైందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల జీవితాల్లో ఒక భాగమై, కష్టసుఖాల్లో నేస్తమై ప్రజాభిమానాన్ని సొంతం చేసుకుందన్నారు. అటువంటి పార్టీని కొన్ని కుహనా రాజకీయ పార్టీలు ప్రజలను మాయమాటలతో లోబరుచుకొని, కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారాలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ప్రజలను భౌతికంగా కాంగ్రెస్ పార్టీకి దూరం చేసినప్పటికీ, ప్రజలను కాంగ్రెస్ నుండి దూరం చేయలేరని అన్నారు. రాష్ట్రంలో షర్మిలమ్మ పగ్గాలు చేపట్టినప్పటి నుండి గత 15 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలే దీనికి సాక్ష్యం అన్నారు. ఈ ప్రాంతంలో గిరిజనుల అవసరాలను తీర్చే దేవాలయం లాంటి ఐటీడీఏ ప్రస్తుత ప్రభుత్వ విధానాలతో నిరుపయోగంగా మారిందని తెలిపారు. గిరిజనులు తిరిగి అడవులకు వెళ్లే పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకు వచ్చిందని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన భూములకు నీటి వసతి కల్పించవలసిన చింతలపూడి ప్రాజెక్టుకు మోక్షం కలుగదని,పోలవరం ప్రాజెక్టు పూర్తి అవదని విమర్శించారు. గిరిజన రైతుల, యువత సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. గత పదేళ్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం పొరపడిందని, షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ పునరుత్తేజం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైసిపి గత ఐదేళ్ల పాలనలో ప్రత్యేక హోదా గురించి కనీస ప్రయత్నం చేయలేక పోయిందని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన షర్మిల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టడం, రాష్ట్ర సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న అంకితభావం అర్థమవుతుందని అన్నారు. రాష్ట్రానికి ఏ ఒక్క విభజన హామీని కూడా సాధించలేకపోయిన వైసీపీ ప్రభుత్వం పాలనార్హత కోల్పోయిందని ధ్వజమెత్తారు. ఎస్సీ , ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కూడా దారి మళ్లించి దళితులను, గిరిజనులను వైసీపీ ప్రభుత్వం దగా చేసిందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా మళ్లీ జగనే కావాలని ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని, ప్రజల ఎవరు జగన్ ను మళ్లీ కోరుకోవడం లేదని గ్రహించాలన్నారు. జనంలో మార్పు మొదలైందని, దానికి గిరిజన ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు, విజయవంతం అవుతున్న సమావేశాలు నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర, బస్ యాత్ర బిజెపి వెన్నులో వణుకు పుట్టించి, ప్రజలను మత రాజకీయాలతో రెచ్చగొడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఉత్తరాది మొదలు దక్షిణాది వరకు ఒక్కో రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుందని, అదే క్రమంలో రానున్న సార్వత్రిక ఎన్నికలతో రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కూడా ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలుగుతుందని అన్నారు. దీనికోసం ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన కుక్కునూరు మండలం నెమలిపేట గ్రామ మాజీ సర్పంచ్ వర్సా నాగేశ్వరరావు, ఇసుకపాడు కు చెందిన వడ్డే రఘుబాబు మడకం వీరయ్య, బుట్టాయిగూడెం మండలం అచ్చియ్యపాలెంకు చెందిన తామ సురేష్, పలువురు యువతీ,యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరినీ జెట్టి గురునాధరావు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జులు పైడిముక్కల మురళీకృష్ణ (పోలవరం), జుంగా బాబ్జి (కొయ్యలగూడెం) జాల సీతారామయ్య(జీలుగుమిల్లి), జిల్లా ఎస్సీ సెల్ కూనపాము రాజారత్నం, ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ పి.పోతురాజు, పార్టీ సీనియర్ నేతలు కుంజా నాగరాజు, కరాటం సురేష్ బాబు, వామిశెట్టి వెంకటేశ్వరరావు, ఏసుపాదం, రాణి రత్నప్రభ, తదితరులు పాల్గొన్నారు.