పవన్ కు జోగయ్య ప్రశ్నలు ..
సీఎం పదవి పై నిలదీత
జనసేన లేకుండా టీడీపీ గెలవడం కష్టం అని 2019లో తేలింది
అమరావతి:-
ఆంధ్రప్రదేశ్లో పొత్తుల రాజకీయం మారుతోంది. టీడీపీ,జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించాయి. సీట్ల పంపకం పైన రెండు పార్టీల అధ్యక్షులు ఒక నిర్ణయానికి వచ్చారు. జనసేనకు 25-27 సీట్ల వరకు కేటాయించేలా చంద్రబాబు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీని పైన మాజీ ఎంపీ హరి రామజోగయ్య మండిపడ్డారు. చంద్రబాబును సీఎం చేయటం కోసం జగన్ ను దించాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. సీట్ల ఖరారు పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన మధ్య సీట్ల షేరింగ్ కీలక అంశంగా మారుతోంది. జనసేనాని పవన్ 35 సీట్లు కోరారని తెలుస్తోంది. ఈ మేరకు జాబితాతో సహా చర్చల్లో ప్రతిపాదించారని సమాచారం. కానీ, చంద్రబాబు నుంచి 25 -27 సీట్ల వరకు మాత్రమే అంగీకారం వచ్చిందని చెబుతున్నారు. ఇప్పుడు జనసేనకు 40 సీట్లు తగ్గితే ఓట్ల బదిలీ పైన ప్రభావం పడుతుందనే చర్చ అంతర్గతంగా జనసేన వర్గాల్లో జరుగుతోంది. ఇప్పుడు ఇదే సీట్ల అంశం పైన చేగొండి హరి రామ జోగయ్య జనసేనాని పవన్ కు బహిరంగ లేఖ రాసారు. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు. జగన్ ను దించాలంటే చంద్రబాబును సీఎం చేయటం కోసమా అంటూ జోగయ్య ప్రశ్నించారు. చంద్రబాబుకు అధికారం కోసం కాపులు పవన్ వెంట నడవటం లేదని పేర్కొన్నారు.దామాపా ప్రకారం జనసేనకు 40-60 సీట్లు ఇవ్వాలని..అప్పుడే ఓట్ల బదిలీ జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. చంద్రబాబును సీఎం పదవి రెండున్నారేళ్లు పవన్ కు ఇస్తామని ప్రకటన చేయాలని జోగయ్య డిమాండ్ చేసారు. రావాల్సిన నిష్పత్తిలో సీట్లు రాకపోతే జరిగే నష్టానికి పవన్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని జోగయ్య కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీని దింపాలంటే జనసేనకు ఇష్టం ఉన్నా, లేకపోయినా టీడీపీతో కలిసి వెళ్లడం తప్పనిసరి అనేది కాదనలేని పరిస్థితి అని చెప్పారు. వైసీపీని అధికారం నుంచి తప్పించడం అంటే.. టీడీపీకి పూర్తి అధికారాన్ని కట్టబెట్టడం కాదు కదా అని అన్నారు. జనసేన లేకుండా టీడీపీ గెలవడం కష్టం అనేది 2019 ఎన్నికల్లో తేలిందని… ఈ నేపథ్యంలో జనసే నకు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుందనే ప్రశ్న ఉత్పన్నం కాకూడదని చెప్పారు. టీడీపీకి జనసేన ఎన్ని సీట్లు ఇస్తుందనేదే ప్రశ్న కావాలని అన్నారు. కనీసం 50 సీట్లయినా దక్కించుకుంటేనే… రాజ్యాధికారం పూర్తిగా కాకపోయినా, పాక్షికంగా దక్కే అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి పదవిని మీకు రెండున్నర సంవత్సరాలైనా కట్టబెడుతున్నట్టు ఎన్నికలకు ముందే మీరు చంద్రబాబు నోటి వెంట ప్రకటించగలుగుతారా? అని ప్రశ్నించవలసి వస్తుందని పవన్ ను ఉద్దేశించి అన్నారు.