అమరావతి:పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం పిలుపునిచ్చిన ‘చలో అసెంబ్లీ’ ఉద్రిక్తంగా మారింది. పోలీసులను తప్పించుకుని అసెంబ్లీ పరిసరాలకు వచ్చిన సర్పంచులు ప్రభుత్వానికి వ్యవతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పోలీసుల దాడిలో సర్పంచల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమేష్ తీవ్రంగా గాయపడ్డారు. అసెంబ్లీ పరిసరాల్లోకి చొచ్చుకొచ్చిన సర్పంచులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. వారిని ఈడ్చుకెళ్లి బస్సుల్లో పడేశారు. ఈ ఘటనలో పలువురు సర్పంచులు గాయపడ్డారు.ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం దారిమళ్లించిందంటూ ఆందోళన చేపట్టారు. దారి మళ్లించిన నిధులు సర్పంచుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్లను సర్పంచుల అధీనంలోకి తేవాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధిహామీ నిధులను చట్ట ప్రకారం పంచాయతీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.