Thursday, November 28, 2024

Creating liberating content

టాప్ న్యూస్ఘనంగా డా.వై.ఎస్సార్ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం 26వ స్నాతకోత్సవం

ఘనంగా డా.వై.ఎస్సార్ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం 26వ స్నాతకోత్సవం

• విశిష్ట అతిథిగా విచ్చేసిన రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ ఛాన్స్ లర్ ఎస్. అబ్దుల్ నజీర్
• వివిధ కోర్సుల్లో ప్రతిభ కనబర్చిన 60 మంది విద్యార్థులకు గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్, బహుమతులు ప్రదానం
• ప్రజారోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చి ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు కృషి చేయాలని విద్యార్థులకు సూచన
• గౌరవ డాక్టరేట్ స్వీకరించి స్నాతకోత్సవ ప్రసంగం చేసిన నిమ్హాన్స్ సైకియాట్రీ సీనియర్ ప్రొఫెసర్, డైరెక్టర్ డా. ప్రతిమా మూర్తి

విజయవాడ:ప్రజారోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు కృషి చేస్తోందని రాష్ట్ర గవర్నర్, డా.వై.ఎస్సార్ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయ ఛాన్స్ లర్ .ఎస్. అబ్దుల్ నజీర్ తెలిపారు. మంగళవారం విజయవాడలోని “ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్” లో డా.వై.ఎస్సార్ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం 26వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విశిష్ట అతిథిగా విచ్చేసిన రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ ఛాన్స్ లర్ఎ స్. అబ్దుల్ నజీర్ అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో వివిధ కోర్సుల్లో ప్రతిభ కనబర్చిన 60 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాతో పాటు మెడల్స్ మరియు బహుమతులు ప్రదానం చేసి అభినందనలు తెలిపారు. ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థులను తీర్చిదిద్దిన అధ్యాపకుల కృషిని ప్రశంసించారు. డాక్టర్ ఆఫ్ సైన్స్(హానరీస్ కాసా) లో డా.వై.ఎస్సార్ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ స్వీకరించిన బెంగుళూరులోని నిమ్హాన్స్ (నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ అండ్ న్యూరో సైన్సెస్) సైకియాట్రీ సీనియర్ ప్రొఫెసర్, డైరెక్టర్ డా. ప్రతిమా మూర్తిని గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ వైద్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో వైద్యరంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, నిరుపేదలకు ఉపయోగపడేలా సేవాభావంతో వైద్యసేవలు అందించాలని సూచించారు. వైద్య విద్యను అభ్యసిస్తున్నందుకు గర్వపడాలని, భవిష్యత్ లో కఠోర శ్రమ, పట్టుదల, నిజాయితీతో పనిచేయాలని సూచించారు. ఆస్పత్రికి వచ్చే రోగికి చికిత్స అందించడమే కాదు రోగి కళ్లలో ఆనందం నింపి క్షేమంగా ఇంటికి పంపించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్ద పీట వేసిందన్నారు.
ప్రస్తుత కాలంలో వైద్య సేవలే కాదు వైద్య విద్యను కూడా అందరికీ చేరువ చేసిందన్నారు. వైద్య రంగంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు సత్ఫలితాలిస్తున్నాయన్నారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఆరోగ్యశ్రీ క్రింద చికిత్స వ్యయ పరిమితిని రూ.25 లక్షలకు పెంచడంతోపాటు 3,257 వైద్య ప్రక్రియలతో సహా అన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకు ఎలాంటి వ్యయ పరిమితి లేకుండా ఉచితంగా చికిత్స అందించడం శుభ పరిణామనన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 11 మెడికల్ కాలేజీలకు అదనంగా 17 కొత్త మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఇప్పటికే 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించి తరగతులు కూడా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో ప్రజల ముంగిటకే వైద్య సేవలు అందిస్తోన్న ప్రభుత్వం అదనంగా 10,132 విలేజ్ హెల్త్ క్లినిక్ లు, 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, 53 ఏరియా ఆస్పత్రులు, 12 జిల్లా ఆస్పత్రులు, 11 టీచింగ్ హాస్పిటల్స్, 15 స్పెషాలిటీ హాస్పిటల్స్, 542 అర్బన్ పీహెచ్ సీలతో రోగుల ఆరోగ్యానికి భద్రత, భరోసా కల్పిస్తోందన్నారు. డా.వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ పరిధిలోని 439 కళాశాలల్లో మెడికల్, డెంటల్, ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, నేచురోపతి, యోగా, నర్సింగ్, ఫిజియోథెరపీ, ఇతర అనుబంధ పారామెడికల్, ఆరోగ్య విజ్ఞాన కోర్సులను అభ్యసిస్తున్న వేలాది మంది విద్యార్థులు భవిష్యత్ లో ప్రజలకు వైద్యసేవలు అందించాలని సూచించారు. తాము చదువుకున్న విశ్వవిద్యాలయానికి సమాజంలో కీర్తిప్రతిష్టలు తీసుకొస్తారని విశ్వసిస్తున్నానన్నారు. మందులు వ్యాధులను మాత్రమే నయం చేస్తాయి కానీ రోగిని నయం చేసేది మాత్రం వైద్యుడే అని ఈ సందర్భంగా గుర్తుచేశారు. భవిష్యత్ లో అందరూ ఉన్నతంగా రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని గవర్నర్ కాంక్షించారు.బెంగుళూరులోని నిమ్హాన్స్ (నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ అండ్ న్యూరో సైన్సెస్) సైకియాట్రీ సీనియర్ ప్రొఫెసర్, డైరెక్టర్ డా. ప్రతిమా మూర్తి డాక్టర్ ఆఫ్ సైన్స్(హానరీస్ కాసా) లో గౌరవ డాక్టరేట్ స్వీకరించిన అనంతరం స్నాతకోత్సవ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా గౌరవ డాక్టరేట్ అందించినందుకు గవర్నర్ కు, యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్, పాలక వర్గానికి ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె సూచించారు. ఏ రంగంలో అయినా నిరంతర జ్ఞానాన్వేషణ అవసరం అన్నారు. ప్రతి రోజూ నిత్యవిద్యార్థిగా ఉండాలని సూచించారు. డాక్టరేట్ లభించడం సంతోషకరమన్నారు. డా.వై.ఎస్సార్ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం వైస్ ఛాన్స్ లర్ డా.కోరుకొండ బాబ్జి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో చేపట్టిన సంస్కరణలు అభినందనీయమన్నారు. యూనివర్సిటీకి సంబంధించిన ప్రతి సర్టిఫికెట్ ను విద్యార్థులకు ఆన్ లైన్ లో అందిస్తున్నామన్నారు.కార్యక్రమంలో డా.వై.ఎస్సార్ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం వైస్ ఛాన్స్ లర్ . డా.కోరుకొండ బాబ్జి, రిజిస్ట్రార్ డా.వేమిరెడ్డి రాధికా రెడ్డి, అకడమిక్ జాయింట్ రిజిస్ట్రార్ అజయ, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ డైరెక్టర్ సుమిత శంకర్, జాయింట్ రిజిస్ట్రార్(ఎగ్జామినేషన్స్) పి. ప్రవీణ్ కుమార్, యూనివర్సిటీ పాలక వర్గ సభ్యులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article