200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితమేనని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వివరణ
హైదరాబాద్:గృహజ్యోతి పథకానికి అద్దెకుండే వారు కూడా అర్హులేనని, వారికి కూడా 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితమేనని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) వివరణ ఇచ్చింది. ఇంట్లో అద్దెకున్న వారికి ఈ పథకం వర్తించదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడంపై డిస్కం స్పందించింది. ఆ వార్తలేవీ నిజం కాదని పేర్కొంది. దీంతో ఎవరు అర్హులు.. ఎవరు అనర్హులనే విషయంపై స్పష్టత కొరవడింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై డిస్కం కొంత స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసింది. ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా మార్గదర్శకాలు విడుదల చేయలేదని తెలిపింది. రాష్ట్రంలో 1.31 కోట్ల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. ఉచిత విద్యుత్ పథకానికి 82 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదలైతే అర్హులు ఎవరు, రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది ఉంటారనే అంశంపై క్లారిటీ వస్తుందని అధికారులు వివరించారు.