బడ్జెట్.. కేటాయింపులు
ఉచిత పంటల బీమా కోసం రూ.3411 కోట్లు
సున్నా వడ్డీ రుణాలు రూ.1835 కోట్లు
జగనన్న విద్యాదీవెన రూ.11,901 కోట్లు
జగనన్న వసతి దీవెన రూ.4267 కోట్లు
జగనన్న పాలవెల్లువ రూ.2697 కోట్లు
YSR బీమా రూ.650కోట్ల
నేతన్ననేస్తం కోసం రూ.983
కల్యాణమస్తు, షాదీ తోఫా రూ.350 కోట్లు
జగనన్న తోడు రూ.3374 కోట్లు
వాహనమిత్ర రూ.1305 కోట్లు
అమరావతి:బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ చాణక్యుడి తరహాలో పాలన అందిస్తున్నారని కొనియాడారు. బుధవారం అసెంబ్లీలో ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెట్టి మంత్రి బుగ్గన ప్రసంగించారు. అంబేద్కర్ ఆశయాలే తమ ప్రభుత్వానికి ఆదర్శమని, రాష్ట్రంలోని ఏ బలహీన వర్గాన్నీ విస్మరించకూడదన్న వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో ఈ బడ్జెట్ కు రూపకల్పన చేసినట్లు తెలిపారు.సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే సభలో గందరగోళం నెలకొంది. రైతు సమస్యలపై చర్చించాలంటూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ వెల్లోకి వెళ్లి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనల మధ్యే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బిల్లులను ప్రవేశపెట్టారు.రూ.2,86,389 కోట్ల బడ్జెట్‍ను ఏపీ అసెంబ్లీలో మంత్రి మంత్రి బుగ్గన ప్రవేశపెట్టారు. – రూ.2,30,110 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.30,530 కోట్ల మూలధన వ్యయంగా లెక్కించారు. రూ.24,758 కోట్ల రెవెన్యూ లోటుగా అంచనా వేశారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యే ముందు కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు రాష్ట్ర క్యాబినెట్ అమోద ముద్ర వేసింది. సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన క్యాబినెట్ భేటీలో బడ్జెట్‌కు అమోదం తెలిపారు.సచివాలయంలో ముఖ్యమంత్రి చాంబర్‌లో సీఎం వైఎస్ జగన్ కు బడ్జెట్ ప్రతులను ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు అంద చేశారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ ఐదేళ్లలో వైద్యం, విద్య, మహిళా సాధికారత, వ్యవసాయం, రైతులు, వృద్ధులకు ప్రాధాన్యత ఇచ్చామని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. మ్యానిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించిన వారు గతంలో ఎవరు లేరన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 99శాతం హామీలను అమలు చేశామన్నారు. సంక్షేమాన్ని సంతృప్తి కర స్థాయిలో అమలు చేశామని, బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ప్రభుత్వం లేకపోతే తమ బ్రతుకులు ఎలా అనుకునే వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు.
అసెంబ్లీలో గందరగోళం
రైతుల సమస్యలపై చర్చించాలంటూ తెలుగుదేశం వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. దీన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించడతో వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ నేతలు పట్టుపట్టారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు వ్యతిరేక ప్రభుత్వమని, క్రాప్ ఇన్సూరెన్స్, కౌలు రైతులను మర్చిపోయిన ప్రభుత్వం నశించాలంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.
అసెంబ్లీలో మంత్రి బుగ్గన ఏమన్నారంటే…
సంతృప్త స్థాయిలో మానిఫెస్టోను అమలు చేయడం తమ ప్రభుత్వ బెంచ్ మార్క్ అని ఆర్ధిక మంత్రి అన్నారు. జగన్ విధానాలు ఎన్నో రాజకీయ పార్టీలకు బెంచ్ మార్క్ అయిందన్నారు. అట్టడుగున ఉండే బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చామని.. విద్య, వైద్యం, మహిళ సాధికారిత, వృద్ధులకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్టు కాకుండా మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. విభజన హామీలు చాలా వరకు ఎన్నో సాధించు కోగలిగామన్నారు. కచ్చితంగా సంక్షేమానికే పెద్దపీట ఉంటుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు.
నంద్యాల జిల్లా డోన్‌లో కొత్తగా హార్టికల్చరల్ పుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి. డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చర్ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనున్న హార్టికల్చరల్ పాలిటెక్నికల్ కళాశాల ఏర్పాటుకు క్యాబినెట్ అమోదం తెలిపింది. నంద్యాల జిల్లా డోన్‌లో వ్యవసాయరంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనున్న అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల.
ఆంధ్రప్రదేశ్ ప్రేవేట్ యూనివర్శిటీస్ యాక్ట్ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్‌ఫీల్డ్ కేటగిరిలో మూడు ప్రేవేట్ యూనివర్శిటీలకు అనుమతి ఇస్తూ క్యాబినెట్ అమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు మంత్రిమండలి అమోదం తెలిపింది.
అంబేడ్కర్ నివాళి అర్పిస్తూ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఏర్పాటు ద్వారా అంబేడ్కర్ ఆశయాలు తమ ప్రభుత్వానికి మార్గదర్శకం వహిస్తున్నాయని చెప్పారు. దార్శనికుల ఆలోచనల్ని కార్యరూపంలోకి తెచ్చిందని బుగ్గన చెప్పారు. అసమానతలు రూపుమాపడం, నాణ్యమైన విద్య, జీవనోపాధికి సాయం చేయడం, సుస్థిరమైన అభివృద్ధికి ఇవన్నీ అవసరమని భావిస్తున్నాం. వాగ్ధానాల అమలు, ప్రజల అకాంక్షల అమలులో చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం.
విభజన అనంతరం ప్రతికూల పరిస్థితుల్లో కూడా అత్యంత పురోగతి సాధించ గలిగినట్టు బుగ్గన చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత జటిలమైన విభజన సమస్యలతో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఐదేళ్లలో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు చెప్పారు. నవరత్నాల ద్వారా అందిస్తున్న వినూత్న కార్యక్రమాలతో ప్రపంచ మేధావుల అభినందనలు అందుకుంటున్నట్లు చెప్పారు. తక్కువ సమయంలో ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చామన్నారు.ఆర్ధిక చేయూత అందివ్వడం ద్వారా ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చినట్టు ఆర్ధిక మంత్రి చెప్పారు. ఆర్ధిక మాంద్యం ఉన్నపుడు ప్రజలకు ఆర్ధికంగా చేయూతనివ్వాలనే సిద్ధాంతాన్ని అమలు చేసినట్టు చెప్పారు. తద్వారా గణనీయమైన పురోగతి సాధించినట్టు చెప్పారు.