మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ వెంకటరత్నమ్మ.
లేపాక్షి :ఎండాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మండలం వ్యాప్తంగా గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీటీసీలు ,సర్పంచ్లు ,సంబంధిత అధికారులకు సూచించారు. మండల కేంద్రమైన లేపాక్షి లోని శ్రీ శక్తి భవన్లో ఎంపీపీ వెంకటరత్నమ్మ ఆధ్వర్యంలో లేపాక్షి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా నెలకొన్న సమస్యలను సంబంధిత అధికారులు పరిష్కరించాలన్నారు. ప్రధానంగా ఎండాకాలం ప్రారంభమైందన్నారు. ఎండాకాలంలో మండలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా సంబంధిత అధికారులు, ఎంపీటీసీl సభ్యులు, సర్పంచులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని గ్రామాల్లో కూడా తాగునీటి బోరు బావులు పనిచేస్తున్నాయన్నారు. ఎక్కడైనా తాగునీటి బోర్లకు సంబంధించిన మోటర్ లు మరమ్మత్తులకు గురైతే వెంటనే వాటిని సిద్ధం చేసి తాగునీటి సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం హౌసింగ్ ఏఈ త్రిశూల్ మాట్లాడుతూ, మండలంలో ఇప్పటివరకు జగనన్న కాలనీలలో నాలుగు వందల పై చిలుకు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని మరికొన్ని పూర్తయ్యాయని తెలిపారు. జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఎంఈఓ నాగరాజు మాట్లాడుతూ, మండలంలోని దాదాపు అన్ని పాఠశాలలు నాడు నేడు కింద ఎంపికయ్యా య. ప్రతి పాఠశాలలోనూ అదనపు తరగతి గదుల నిర్మాణాలను చేపట్టడం జరిగిందన్నారు. అన్ని ఉన్నత పాఠశాలలో తరగతి గదులను డిజిటల్ గదులుగా మార్చడం జరిగిందన్నారు. కార్పొరేట్ పాఠశాల స్థాయికి మించి ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, జరగబోవు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నత స్థాయికి ఎదుగుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆదినారాయణ లేపాక్షి ఓరియంటల్ పాఠశాల భవన నిర్మాణాలు పూర్తి కావస్తున్నా సంబంధిత ఇంజనీర్లు సక్రమంగా బిల్లులు చెల్లించడం లేదని పేర్కొన్నారు. దీంతో పీ ఆర్ ఇంజనీర్ హనుమేనాయక్ సమాధానం ఇస్తూ సంబంధిత పాఠశాల నిర్మాణ గుత్తేదారుకు అధిక మొత్తం చేరిందని సమాధానం ఇచ్చారు. ఈ విషయాన్ని గతంలో కూడా చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా అన్ని శాఖల అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన అభివృద్ధి నివేదికలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీ సీ శ్రీనివాసరెడ్డి, మండల ఉపాధ్యక్షురాలు లీలావతి,సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.