వీరభద్రాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కృషితోనే అభివృద్ధి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా ఆలయ కమిటీ చైర్మన్ రమానందన్
లేపాక్షి: త్రేతాయుగం నాటి రామాయణ కథకు ప్రతీకగా నిలిచిన జటాయువు మోక్షఘాట్ కు వీరభద్రాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రమానందన్ చొరవతో మోక్షం లభించింది. గత పదేళ్ల క్రితం దాక జటాయువు మోక్షగాట్ ఒకటి ఉండేదని, బింగిపల్లి సమీపంలో ఉన్నదని పలువురు చెబుతుండేవారు. అయితే నంది ఉత్సవాల సందర్భంగా జటాయువు ఘాటును నాటి ప్రభుత్వం అభివృద్ధి చేయాలని కొంత నిధులు కూడా మంజూరు చేసింది. ఆ వెంటనే బింగిపల్లి రహదారి నుండి జటాయువు మోక్ష ఘాట్ వరకు రహదారిని నిర్మించారు. వెంటనే టీటీడీ నేతృత్వంలో జటాయువు ఘాట్ ప్రాంతాన్ని శుభ్రపరచి గుప్త కామేశ్వరి ఆలయం తో పాటు సీతారాముల ఆలయం, జటాయువు మోక్షఘాట్ , సమీపంలో కోనేరును నిర్మించాలని టీటీడీ భావించింది. ఆ తర్వాత టిటిడి అధికారులు లేపాక్షికి రావడం జటాయువు మోక్షఘాట్ ప్రాంతాన్ని పరిశీలించడం నిధులు మంజూరు చేయడం కొంత వ్యవధిలోనే జరిగిపోయింది.
వెంటనే జటాయువు మోక్షఘాట్ ప్రాంతంలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. పనులు శరవేగంగా జరుగుతున్న సమయంలో సంబంధిత శిల్పి అకాల మరణం పొందడంతో జటాయువు మోక్షఘాట్ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఆ పనులు ఆగి దాదాపు 8 సంవత్సరాలు కావస్తోంది. జటాయువు ఘాట్ పనులను పునరుద్ధరించే నాధుడు కరువయ్యాడు. ఇటీవల లేపాక్షి వీరభద్రాలయ ధర్మకర్తల మండలి చైర్మన్గా రమానందన్ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జటాయువు మోక్ష ఘాట్ విషయాన్ని కొందరు చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో చైర్మన్ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి జటాయువు మోక్షఘాట్ విషయాన్ని వివరించారు. మంత్రి సూచన మేరకు చైర్మన్ టి టి డి అధికారులతో సంప్రదించారు. టీటీడీ నుండి మోక్షఘాట్ విషయం సానుకూలంగా రావడంతో శుభ్రం చేయించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండు రోజులపాటు ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రపరిచారు.
ముళ్లపొదలతో నిండిన ఈ ప్రాంతం పరిశుభ్రంగా మారింది.ఈ సందర్భంగా వీరభద్రాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రమానందన్ మాట్లాడుతూ, లేపాక్షి ఆలయాన్ని యునెస్కో పరిధిలోకి తీసుకు వచ్చేందుకు ఉన్నతాధికారులతో కలసి చర్చించడం జరుగుతుందన్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రధాన కేంద్రాల్లో ఆలయ ప్రాశస్త్యాన్ని తెలిపే బోర్డులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలను చేపట్టడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రాచీన ప్రాసస్త్యము కలిగిన జటాయువు మోక్ష ఘాట్ ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తానన్నారు. మరొకసారి టిటిడి చైర్మన్ తో పాటు అధికారులను కూడా కలసి జటాయు మోక్షఘాట్ పనులను పునః ప్రారంభిస్తాన్నామని చైర్మన్ రమానందన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు అంజన రెడ్డి, జేఏసీ సభ్యులు కరణం రాంప్రసాద్, వైకాపా నాయకులు శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఈడిగ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.