-గురువులను దైవంగా భావించాలి
-నారా భువనేశ్వరి
కదిరి
ప్రతి విద్యార్థి కష్టపడి బాగా చదువుకొని ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో స్థిరపడాలని నారా భువనేశ్వరి ఆకాంక్షించారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా కదిరి విచ్చేసిన నారా భువనేశ్వరి మంగళవారం రాత్రి ఎరుకులవాండ్లపల్లి సమీపంలో ఉన్న హరీష్ పాఠశాలలో బస చేశారు. బుధవారం ఉదయం నారా భువనేశ్వరి హరీష్ పాఠశాలలో కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. మొదట ఆ పాఠశాల ప్రిన్సిపాల్ యం.యస్. కిరణ్ నారా భువనేశ్వరికి పుష్పగుచ్చం ఇచ్చి, విద్యార్థినులచే గణపతి శ్లోకం గావించి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రగణంలో ఉన్న జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. పూజారి ప్రసాద్ రావు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆమె విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి బాగా చదువుకొని పరీక్షలో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. మాస్ కాపీయింగ్ కి తావివ్వకుండా కష్టపడి చదివి బాగా మార్కులు తెచ్చుకొని తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అదేవిధంగా చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తామన్నారు. పాఠశాలను, విద్యార్థులను చూస్తుంటే తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని, తాను కూడా చిన్నప్పుడు క్రీడలు బాగా ఆడేదాన్నని గుర్తు చేశారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులని, విద్యార్థులు అన్ని రంగాల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో స్థిరపడినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని మంచి కోసం ఉపయోగించాలని, విద్యార్థులు సెల్ ఫోన్లకు బానిస కాకూడదని సూచించారు. విద్యార్థులు మనదేశ సంస్కృతి సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని మెలగాలని, మన సంప్రదాయాలను గౌరవించినప్పుడే మనం అనుకున్నది సాధించవచ్చని అభిప్రాయ పడ్డారు. ఈ కార్యక్రమంలో కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్, నాయకులు పర్వీన్ బాను, బాబ్జాన్, సురేష్ బాబు, హైదర్ వలి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.