ఇంచార్జి డిఆర్ఓ శ్రీనివాసులు
కడప బ్యూరో
దళిత కుటుంబంలో జన్మించి.. ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన దామోదరం సంజీవయ్య యావత్ భారత దేశానికే ఆదర్శం.. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని ఇంచార్జి డిఆర్ఓ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్ స్పందన హాలులో దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 103 వ జయంతి సందర్బంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా.. ఇంచార్జి డిఆర్ఓ శ్రీనివాసులు, సాంఘిక సంక్షేమ శాఖ డిడి సరస్వతి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఇంచార్జి డిఆర్ఓ శ్రీనివాసులు మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసిన నిష్కళంక, నిస్వార్థ, నిరడంబర నేత దామోదరం సంజీవయ్య అని ప్రశంశించారు. దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఒక దళిత కుటుంబంలో జన్మించి అత్యున్నత పదవులను అధిరోహించడం భారత దేశం మొత్తం గర్వించదగ్గ విషయం అన్నారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి మన రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లా కేంద్రానికి సమీపంలోని పెద్దపాడు గ్రామంలో 1921 ఫిబ్రవరి 14న జన్మించారన్నారు.
సంజీవయ్య బాల్యంలో పెదపాడు నుంచి కర్నూలుకు రోజూ కాలినడకన వెళ్లి విద్యనభ్యసించారని తెలిపారు. కష్టాలను, పేదరిక బాధలను అనుభవిస్తూ..10వ తరగతిలో జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులై.. అనంతపురంలో పట్టభద్రుడయ్యారన్నారు.
దామోదరం సంజీవయ్య సేవాదృక్పధం, ఉన్నత వ్యక్తిత్వం, మేధాసంపత్తి, సాహితీ, రాజనీతి వంటి విలువలు.. అనతికాలంలోనే ఆయనను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళాయన్నారు. అతి చిన్న వయసులో (38 ఏళ్లలో) దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా 1960 జనవరి 11న ఆయన భాద్యతలు స్వీకరించారన్నారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన అనేక వినూత్న పథకాలతో ప్రజా సంక్షేమానికి పాటుపడుతూ.. భారత ప్రజాస్వామ్య చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు.
సాంఘిక సంక్షేమ శాఖ డిడి సరస్వతి మాట్లాడుతూ.. అట్టడుగు వర్గ ప్రజలపై వివక్షత అధికంగా ఉన్న ఆరోజుల్లో.. ఉన్నత పదవిని అధిరోహించి పరిపాలన చేసే అవకాశం ఆయనకు దక్కిందంటే.. ఆయనలో సుగుణాలు, సౌమ్య శీలత, నిరాడంబర తత్వం, విద్యా, ఉన్నత ఆశయం, లక్ష్య సాధన, నాయకత్వ లక్షణాలే.. కారణం అన్నారు. ఆయన జీవితం యావత్ భారతవనికే ఆదర్శం అన్నారు. కార్యక్రమంలో ముందుగా.. వేదికను అలంకరించిన ప్రముఖులు, ప్రత్యేక అతిధులు దామోదరం సంజీవయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘణంగా నివాళులు అర్పించారు. అనంతరం.. ప్రార్ధనా గీతంతో… సభ ప్రారంభమయ్యింది.
ఈ కార్యక్రమంలో సీపీవో వెంకట్రావు, డి ఐ ఓ విజయ్ కుమార్, డిసిహెచ్ఎస్ హిమ దేవి, డిప్యూటీ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి విజయ్ కుమార్, సెక్షన్ల సూపరింటెండెంట్లు, సిబ్బంది తదితరులు పెద్ద ఎత్తున హాజరైయ్యారు.