జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్
అనంతపురము
రైతు శ్రేయస్సే ధ్యేయంగా వ్యవసాయ, అనుబంధ విభాగాల అధికారులు పని చేయాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాజా మాజీ జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి చైర్మన్ టి.రాజశేఖర్ రెడ్డి ఆకస్మికంగా మృతి చెందడంపై సమావేశంలో వ్యవసాయ సలహా మండలి సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ, రైతుల నుంచి జొన్న, కంది పంటలను కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎంత పంట సేకరించారనే వివరాలు ఆర్బీకేల్లో ప్రదర్శించాలని, ఈ విషయమై మార్క్ఫెడ్, మార్కెటింగ్, సంబంధిత శాఖల మధ్య సమన్వయం ఉండాలన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువుల బిల్స్ పెండింగ్ ఉంచకుండా ప్రతి వారం ఏడీఏలు పరిశీలన చేయాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకుండా చూడాలని స్పష్టం చేశారు. బిల్స్ ఎలాంటి పెండింగ్ ఉంచరాదని రైతు భరోసా కేంద్రం ఇంచార్జ్ కి ఖచ్చితంగా చెప్పాలన్నారు. జిల్లాలో జగనన్న పాలవెల్లువ అమలు కోసం కష్టపడి పని చేసిన పశుసంవర్ధక శాఖ జేడీ, ఇతర శాఖల అధికారులకు జాయింట్ కలెక్టర్ అభినందనలు తెలిపారు. జిల్లాలో నార్పల, బుక్కరాయసముద్రం, యల్లనూరు, తదితర ఐదు మండలాల్లో పాల సేకరణ ఈ నెల 21 తేదీ నుంచి చేపట్టనున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఈ విషయమై రైతులకు
వ్యవసాయ సలహా మండలి సభ్యులు విస్తృతంగా తెలపాలన్నారు. పాడి రైతులకు డిసిసిబి నుంచి రుణాలు కూడా అందిస్తున్నారని, ప్రభుత్వము అన్ని విధాలా సహకారాలు అందిస్తోందని తెలపాలని అన్నారు. వ్యవసాయ శాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ మాట్లాడుతూ, జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఉండటం వల్ల బోరు బావుల క్రింద అధిక నీటితో సాగు చేసే పంటలు వరి, మొక్క జొన్న మొదలగు పంటలు సాగు చెయ్యకుండా రైతులలో అవగహన కల్పించాలని కోరారు. అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన పురుగు మందులు, నీటిలో కరిగే ఎరువులు, సూక్ష్మ ధాతువులను సరఫరా చేస్తామన్నారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు ఆలుమూరు సుబ్బారెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, పెద్దిరెడ్డి, వన్నూరమ్మ మాట్లాడుతూ, జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి చైర్ పర్సన్ టి.రాజశేఖర్ రెడ్డి మృతి చాలా బాధాకరమన్నారు. ఆయన మృతి రైతాంగానికి తీరని లోటన్నారు. అనంతరం రైతు సమస్యలను వారు ప్రస్తావించి పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ను కోరారు. కనేకల్, బొమ్మనహాల్ మండలాల్లో హెచ్చెల్సీ బ్రిడ్జిలు పడిపోయాయని, వాటి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు.ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ జేడీ సుబ్రమణ్యం, ఉద్యాన శాఖ డీడీ రఘునాథరెడ్డి, ఏపీఎమ్ఐపి పీడీ ఫిరోజ్ ఖాన్, సివిల్ సప్లై డిఎం రవీంద్ర, జిల్లా సిరికల్చర్ అధికారి ఆంజనేయులు, ఏపీఎస్పీడిసిఎల్ ఏడీ వివేకానందస్వామి, మార్క్ఫెడ్ డీఎం పెన్నేశ్వరి, ప్రోగ్రెసివ్ రైతులు సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, ఏపీ సీడ్స్ డిఎం సుబ్బయ్య, మార్కెటింగ్ ఏడీ చౌదరి, ఎడిఏలు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, సలహా మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.