రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్ జరుగుతున్న మూడో టెస్టుపై భారత్ పట్టుబిగిస్తోంది. మూడో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ రెండు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌పై 322 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (104; 133 బంతుల్లో) సెంచరీ సాధించాడు. తొలుత నిదానంగా ఆడిన జైస్వాల్ తర్వాత టీ20 తరహాలో బ్యాటింగ్ చేశాడు. వెన్నునొప్పి కారణంతో రిటైర్డ్ హట్‌గా వెనుదిరిగాడు. క్రీజులో శుభ్‌మన్ గిల్ (65; 120 బంతుల్లో), కుల్‌దీప్ యాదవ్ (3; 15 బంతుల్లో) ఉన్నారు.
అయితే శనివారం ఆట ప్రారంభానికి ముందే భారత్‌కు షాక్ తగిలింది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అత్యవసర కారణాలతో మూడో టెస్టుకు దూరమయ్యాడు. కానీ మిగిలిన టీమిండియా బౌలర్లు అద్భుతంగా చెలరేగారు. ఓవర్‌నైట్ స్కోరు 207/2తో ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌట్ చేశారు. హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లిష్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఇంగ్లండ్ తమ చివరి ఎనిమిది వికెట్లు 95 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది.
రెండో సెషన్ వరకు ఆచితూచి ఆడిన జైస్వాల్ టీ బ్రేక్ అనంతరం చెలరేగాడు. బౌండరీలు, సిక్సర్ల మోత మోగించాడు. ఈ క్రమంలో 78 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన అతడు 122 బంతుల్లో సెంచరీ సాధించాడు. అయితే జైస్వాల్ రిటైర్డ్ హట్‌గా వెనుదిరిగిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రజత్ పటిదార్ డకౌటయ్యాడు.