మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ను భారత్ చిత్తు చేసింది. 434 రన్స్ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. 122 రన్స్కే ఆలౌట్ అయ్యింది. భారత్ బౌలర్ల దెబ్బకు ఇంగ్లీష్ జట్టు బ్యాట్స్మెన్స్ వరుసగా పెవిలియన్ బాట పట్టారు. మార్క్ వుడ్ (33) మినహా మిగితా బ్యాట్స్మెన్లు 20 రన్స్ కూడా చేయలేకపోయారు. ఆరుగురు బ్యాట్స్మెన్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో బౌలర్ మార్క్ ఉడ్ సాధించిన 33 పరుగులే అత్యధికం. చివర్లో వచ్చిన మార్క్ ఉడ్ 15 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. జో రూట్ (7), జానీ బెయిర్ స్టో (4), కెప్టెన్ బెన్ స్టోక్స్ (15) విఫలం కావడం ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను ప్రభావితం చేసింది. లంచ్ తర్వాతి సెషన్ లో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను 430/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 50 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. అయితే టెయిలెండర్లు పోరాడడంతో ఇంగ్లండ్ స్కోరు 100 మార్కు దాటింది. బెన్ ఫోక్స్ 16, టామ్ హార్ట్ లే 16 పరుగులు చేశారు.
ఆటలో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ హైలైట్ గా నిలిచింది. రాజ్ కోట్ లో నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో…. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేయగా… ఇంగ్లండ్ 319 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ టెస్టులో విజయం సాధించిన టీమిండియా ఐదు టెస్టుల సిరీస్ లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో జరగనుంది.