అనంతపురం:సిద్ధం సభ సాక్షిగా అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద జర్నలిస్టులపై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్ల్యూజే) తీవ్రంగా ఖండిస్తోంది. వీధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులను రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి. సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, అనంతపురం జిల్లా అధ్యక్షులు పయ్యావుల ప్రవీణ్, ట్రెజరర్ చౌడప్ప, సభ్యులు అక్కులప్ప తీవ్రంగా ఖండించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆంధ్ర జ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ ను యూనియన్ నేతలు పరామర్శించారు. వృత్తి ధర్మంలో భాగంగా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులపై దుర్మార్గంగా దాడులకు తెగబడడం ఉన్మాద చర్య అని నేతలు మండిపడ్డారు రాజకీయ పార్టీలు ఏదైనా ఉంటే యాజమాన్లతో చూసుకోవాలి కాని, జర్నలిస్టులపై భౌతిక దాడులకు పాల్పడడం సహించరానిదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల జర్నలిస్టులపై దాడులు రాష్ట్రంలో పరిపాటిగా మారాయని… ఇప్పటికైనా ఇలాంటి వాటిపై రాజకీయ పార్టీల నేతలు స్పందించాలని కోరారు. అనంతపురం రేంజ్ డిఐజి అమ్మిరెడ్డి, ఎస్పీ అన్బురాజన్ తక్షణమే దాడులపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఘటనను సీరియస్ గా తీసుకొని నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దాడికి నిరసనగా సోమవారం అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో ఆందోళనకు పిలుపు ఇచ్చారు.