జమ్మూకశ్మీర్ :తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర విద్యా సంస్థలను వర్చువల్ గా ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), తిరుపతి జిల్లాలో నెలకొల్పిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఐఐఎస్ఈఆర్ ప్రాంగణాలను మంగళవారం ప్రధాని మోదీ జమ్ము కశ్మీర్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. కర్నూలు ట్రిపుల్ ఐటీని జాతికి అంకితమిచ్చారు. . నిజామాబాద్‌లో కొత్తగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ సముదాయాన్ని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును జాతికి అంకితం ఇవ్వడంతోపాటు పాలమూరు విశ్వవిద్యాలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… గత పదేళ్లలో దేశంలో పలు విద్యా సంస్థలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఒక్క జమ్మూకశ్మీర్ లోనే 50 కొత్త డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశామని తెలిపారు.2024 కు ముందు జమ్మూ కశ్మీర్ లో నాలుగు మెడికల్ కాలేజీలు ఉంటే.. ఇప్పుడు 12 కాలేజీలకు పెంపు చేశామని, దీని ద్వారా 500 సీట్ల నుంచి 1300 సీట్లకు మెడికల్ సీట్లు పెరిగాయని మోదీ తెలిపారు. జమ్మూ కశ్మీర్ ను అన్నివిధాలా అభివృద్ధి చేసి తీరుతామని చెప్పారు. మోదీ గ్యారంటీ అంటే.. తప్పనిసరిగా అమలయ్యే గ్యారంటీ అని అన్నారు. “జమ్ము కశ్మీర్‌లో ఐఐటీ, ఐఐఎం నిర్మిస్తామని హామీ ఇచ్చాం. హమీకి అనుగుణంగానే ఇవాళ జమ్ము కశ్మీర్‌లో ఐఐటీ, ఐఐఎం ప్రారంభించాం. అధునాతన వసతులతో ఐఐఎంలు, ఐఐటీలు, ఐసర్‌లు నిర్మించాం. పదేళ్లలో రికార్డు స్థాయిలో పాఠశాలలు, కాలేజీలు, వర్సిటీలు నిర్మించాం” అని ప్రధాని అన్నారు.