తాడేపల్లి:వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ఐదో విడత నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లోకి నిధులను జమ చేశారు. అక్టోబరు-డిసెంబరు 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా క్రింద రూ.78.53 కోట్ల ఆర్థిక సాయం చేశారు. వధువుల తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు.
తల్లి చదివితే, పిల్లలూ చదువు బాట పడుతారు, కుటుంబం భవిష్యత్తు తలరాత మారాలంటే మంచి చదువులే కుటుంబానికి ఆస్తిగా మారుతాయని, అందుకే వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోపా పథకాల్లో వధువరూలకు కనీస విద్యార్హత నిబంధన విధించామని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లి సీఎంవో కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేశారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… దేవుడి దయవల్ల ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోందని చెప్పారు. పేద పిల్లల చదువులను ప్రోత్సహించే క్రమంలో వరుడు, వధువు ఇద్దరూ కూడా పదో తరగతి చదివి ఉండాలనే నిబంధన విధించామని చెప్పారు. మన తలరాత, భవిష్యత్తు మార్చే శక్తి చదువుకు ఉందని అన్నారు. మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతిలోనే ఉందని చెప్పారు. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి, వారి వివాహాలను గౌరవప్రదంగా జరిపించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని జగన్ అన్నారు.అదేమాదిరిగా వసతి దీవెన కూడా బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి రూ.20 వేల దాకా విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్ లో ఇస్తున్నాం. 18 ఏళ్లకు ముందే పెళ్లి జరిగితే ఈ స్కీమ్ కు అనర్హులు కాబట్టి, ఇంటర్ మీడియట్ కోసం కాలేజీకి పంపితే అమ్మ ఒడి అనే పథకం ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం మంచి జరుగుతుందని, అందుకే కచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ చదివించే కార్యక్రమం దిశగా తల్లిదండ్రులు అడుగులు వేస్తారని, ఇంటర్ తర్వాత పూర్తి ఫీజు రీయింబర్సుమెంట్ ఇచ్చే విద్యాదీవెన ఉంది. ఈ రెండు స్కీములు ఎలాగూ ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాపా, ప్రతి పిల్లాడూ గ్రాడ్యుయేట్స్ అయ్యేలా అడుగులు వేయించగలుగుతున్నామని సీఎం జగన్ వివరించారు.