ఆధ్యాత్మికంః
నరనారాయుడికి ప్రతీకగా నారసింహస్వామిని కొలుస్తారు.అలాంటి నాసింహ క్షేత్రాలు దక్షిణ భారతంలో అనుకం ఉన్నాయి. వాటిలో కొన్ని మనకు చాలా సమీపంలో ఉన్నాయి. అందులో కొన్నింటిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం …
గుహలో స్వయంభువుగా కొలువుదీరి సంతాన ప్రదాతగా పూజలు అందుకుంటున్న ఈ నరసింహస్వామి దర్శనం సర్వపాపహరణమని అంటారు. జోడు లింగాలు ఉండే ఈ నారాయణ క్షేత్రానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది.దట్టంగా కనిపించే చెట్లూ, ఎత్తైన కొండలతో అలరారే ప్రకృతి రమణీయత మధ్య ఉంటుంది లింబాద్రిగుట్ట ఆలయం. ఎత్తైన శిఖరం తప్ప ప్రత్యేక ఆలయం అంటూ లేని ఈ మహిమాన్విత క్షేత్రం నిజామాబాద్ జిల్లా, భీమ్‌గల్ మండల కేంద్రంలో ఉంటుంది. నింబాచలంగానూ ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రంలోకి గుహమార్గం ద్వారా వెళ్తే రాళ్లమధ్య స్వయంభువుగా వెలసిన నరసింహస్వామి లక్ష్మీదేవి సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు. నిత్యం వేలాది భక్తులు వచ్చే ఈ క్షేత్రంలో స్వామి మూలవిరాట్టు పక్కన విష్ణుమూర్తి, కృష్ణార్జునుల విగ్రహాలూ ఉంటాయి. బద్రీనాథ్ తరువాత ఇక్కడే అలా విగ్రహాలు ఉంటాయనీ, అందుకే ఈ ఆలయానికి దక్షిణ బద్రీనాథ్ అనే పేరు వచ్చిందనీ అంటారు.
పార్వతీ పరమేశ్వరుల కల్యాణానికి హాజరైన బ్రహ్మదేవుడు ఆ సమయంలో పార్వతీ దేవి పాదాలను చూశాడట. అది గమనించి ఆగ్రహించిన పరమేశ్వరుడు బ్రహ్మదేవుడి అయిదో తలను ఖండించడంతో బ్రహ్మ ఈ ప్రాంతానికి వచ్చి శ్రీహరి అనుగ్రహం కోసం తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయణుడు కరుణించడంతో నరసింహ రూపంతో ఈ ప్రాంతంలో కొలువుదీరమంటూ బ్రహ్మ వేడుకున్నాడట. అలా స్వామి ఇక్కడ లక్ష్మీసమేతంగా స్వయంభువుగా వెలిశాడని అంటారు. అదేవిధంగా హిరణ్యకశిపుని సంహారం తరవాత నరసింహస్వామి ఈ ప్రాంతంలో సేదతీరి… స్వయంభువుగా వెలిశాడనే కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది. శ్రీహరి ఆలయాల్లో శివలింగాలు ఉండటం అరుదైతే… ఇక్కడ జోడులింగాలు కనిపిస్తాయి. బ్రహ్మ అయిదో తలను ఖండించాక పరమేశ్వరుడు బ్రహ్మహత్యా దోష నివారణకై తపస్సు చేయడంతో.. విష్ణుమూర్తి అనుగ్రహించి ఇక్కడ జోడు లింగాల రూపంలో కొలువుదీరమంటూ సూచించాడట. అందుకే ఇక్కడ గర్భాలయ ప్రవేశద్వారం వద్ద జోడు శివలింగాలు ఉంటాయి.
రెండు అంతస్తులుగా ఉండే ఈ గుట్టలో మొదటి అంతస్తులో స్వామివారి మాడవీధుల్నీ, కమలా పుష్కరిణినీ, కల్యాణమండపాన్నీ, రథాన్నీ, అయోధ్య అంజనేయస్వామి ఆలయాన్నీ చూడొచ్చు. రెండో అంతస్తులో రాతి గుహలో స్వామి మూలవిరాట్టు, ఆ పక్కనే విష్ణుమూర్తి, కృష్ణార్జునుల విగ్రహాలూ, జోడు లింగాలు ఉంటాయి. ఇతర నారసింహ క్షేత్రాలతో పోలిస్తే.. ఇక్కడ స్వామి రూపం శాంతంగా ఉంటుంది. ఈ క్షేత్రంలో ఏడాది మొత్తం జరిగే పూజలు ఒకెత్తయితే నరసింహ జయంతి రోజున ప్రత్యేక ఉత్సవాలూ, కార్తికంలో బ్రహ్మోత్సవాలనూ నిర్వహించడం మరొకెత్తు. బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ఆలయానికి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామాలయంలోని ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక ఊరేగింపుతో, బోనాలతో కొండపైకి తీసుకెళతారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల సమయంలో స్వామికి ప్రత్యేకంగా గరుడ ముద్దల పేరుతో అన్నాన్ని నివేదిస్తారు. ఈ ఉత్సవానికి రెండు మూడు రోజుల ముందుగా కొత్తగా పెళ్లయిన దంపతులూ, పిల్లలు లేనివాళ్లూ తమ వివరాలను ఆలయంలో నమోదు చేయించుకుంటారు. అలా వచ్చే జంటల సంఖ్యను బట్టి అన్నప్రసాదాన్ని ముద్దలుగా చేసి స్వామికి నివేదించి తరువాత ఆ దంపతులకు ఇస్తారు. వాటిని స్వీకరించే దంపతులకు సంతానం తప్పకుండా కలుగుతుందని భక్తుల నమ్మకం. శని, ఆదివారాలు నిత్యాన్నదానం జరిగే ఈ క్షేత్రాన్ని కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్.. తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు దర్శించుకోవడం విశేషం.
హైదరాబాద్ నుంచి నేరుగా ఆర్మూర్ వరకూ బస్సుల్లో రావొచ్చు. ఆర్మూర్ నుంచి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉండే భీమ్‌గల్ మండల కేంద్రానికి చేరుకుంటే… అక్కడి నుంచి లింబాద్రిగుట్టకు వెళ్లేందుకు బస్సులూ, ఆటోలూ ఉంటాయి. భీమ్‌గల్ మండలం నుంచి లింబాద్రి గుట్ట అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.