పిల్లి అనంత లక్ష్మీ సత్యనారాయణ మూర్తి
ప్రజాభూమి,కాకినాడ రూరల్
జగన్ ప్రభుత్వము అధికారం చేపట్టిన నాటి నుండి బీసీలపై దాడులు చేస్తూ కక్ష్య సాధింపు ధోరణితోనే వ్యవహరిస్తుందని అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు,టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు లను అరెస్ట్ చేశారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. ఈ మేరకు కాకినాడ రూరల్ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యర్ధులను రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారని, ఏదోక నెపంతో తన రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడడం, అరెస్టులు చేయించడం,అక్రమ కేసులు బనాయించడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు.గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చం నాయుడు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ను ఇప్పుడు ఆదిరెడ్డి అప్పారావు,వాసులను అరెస్ట్ చేశారని ప్రజాస్వామ్యంలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని కేసుల పేరుతో భయపెట్టాలనుకోవడం తగదన్నారు.రాజకీయంగా వైకాపా పార్టీ నానాటికి దిగజారిపోతుందని దీనిని ప్రజలంతా గమనిస్తున్నారని, అధికార పార్టీ నేతలు మూల్యం చెల్లించే రోజు అతి దగ్గరలో ఉందని అన్నారు.