- జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్
- ఫోటో జర్నలిస్టు శ్రీకృష్ణపై దాడిని తీవ్రంగా ఖండించిన ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవీ.సుబ్బారావు, జాతీయ నేతలు
- జర్నలిస్టులు ఏ ఒక్క పార్టీకి వత్తాసు పలకరు : ఐజేయూ నాయకులు సోమ సుందర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్
- రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది : వామపక్షాలు, ప్రజా, విద్యార్థి, సామాజిక సంఘాల ధ్వజం
- జర్నలిస్టులకు నిరంతరం అండగా ఉంటామని, జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరికలు
- అనంతలో కదంతొక్కిన జర్నలిస్టులు, వివిధ పార్టీలు ప్రజా సంఘాలు నాయకులు
- దాడులపై నిరసనగా చేపట్టిన “చలో అనంతపురం” విజయవంతం
అనంతపురము
రాష్ట్రంలో మీడియా, పత్రిక జర్నలిస్టులపై జగన్ ప్రభుత్వంలో పెచ్చు మీరి పోతున్నాయని, రాప్తాడులో ఈ నెల 18న జరిగిన జగన్ సిద్ధం బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై పాశవికంగా దాడులు చేయడం, హత్యాయత్నానికి పాల్పడం అత్యంత దారుణమని, ఈ ఘటనకు సంబంధించి నిందితులను అందరినీ అరెస్టు చేసి వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు డిమాండ్ చేశారు. శ్రీకృష్ణపై దాడికి నిరసనగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో చలో అనంతపురం నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చామని, దీంతో నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే సీఎం జగన్ ప్యాలెస్ కు పిలుపునిచ్చి ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. శ్రీకృష్ణపైనా, కర్నూలులో ఈనాడు పైన జరిగిన దాడికి నిరసనగా చలో అనంతపురం కార్యక్రమానికి రాయలసీమ పరిధిలోని జిల్లాల నుంచి జర్నలిస్టులు తరలివచ్చారు. కర్నూలు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో పోలీసులు ఈ కార్యక్రమానికి రాకుండా ఎక్కడికి ఎక్కడ నిర్బంధించడాన్ని జర్నలిస్ట్ సంఘాలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. చలో అనంతపురం కార్యక్రమం సందర్భంగా గురువారం ఉదయం నగరంలోని సంగమేష్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు జర్నలిస్టులు, చిన్న పత్రికల సంఘం, కమ్యూనిస్టు పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, సామాజిక సంస్థలు సంయుక్తంగా భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద ఏపీయూడబ్ల్యూజే అనంతపురం జిల్లా అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్ అధ్యక్షతన, ప్రధాన కార్యదర్శి అయూఫ్ సారధ్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి ఐవీ. సుబ్బారావు మాట్లాడుతూ, మీడియా స్వేచ్ఛను రాష్ట్రంలో పూర్తిగా హరించాలన్న ఉద్దేశంగా ప్రభుత్వ వైఖరి కనిపిస్తోందని ధ్వజమెత్తారు. ఇలాంటి దుశ్చర్యలను దేశంలో రాష్ట్రంలో ప్రజలు వివిధ ప్రజా సంఘాలు సహించబోరని చలో అనంతపురంతో రుజువైందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ధమనకాండను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని ఈ సభ ద్వారా అర్థమైందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, డిజిపి, కళ్ళు తెరవాలని, జరిగిన సంఘటనపై క్షమాపణ కోరి నిందితులను అరెస్టు చేసి హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. లేదంటే చలో అనంతపురం నకు పిలుపునిచ్చిన తాము చలో జగన్ ప్యాలెస్ పిలుపునిచ్చి ముట్టడిస్తామని స్పష్టంగా హెచ్చరించారు. అలాగే, జర్నలిస్టులపై దాడులు జరగకుండా కట్టుదిట్టం చేయాలని, పార్టీ కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాలని, పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవడంతో పాటు జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపైనే దాడులు చేసి హత్యాయత్నానికి పాల్పడి, తిరిగి మాపైనే నాన్ బెయిలబుల్ కేసులు, ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం సీఎం జగన్మోహన్ రెడ్డి మనస్తత్వానికి అద్దం పడుతున్నదన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పదేపదే జర్నలిస్టులపై భౌతిక దాడులకు పాల్పడుతూ, విచక్షణారహితంగా దాడులు చేస్తూ ఉండటాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టామన్నారు. రాప్తాడు ఘటనలో సీఎం జగన్ ఉన్న సభలోనే ఫోటో జర్నలిస్టుపై దారుణంగా దాడులు చేయడం, తీవ్రంగా గాయపరచడం జరిగినప్పటికీ సీఎం గాని, డిజిపి గానీ నోరు మెదపకపోవడం అత్యంత బాధాకరమన్నారు. జర్నలిస్టులపై విచక్షణారహితంగా నిర్బంధంగా జరిపే ఇలాంటి ఘటనాలను మనం గర్హించాలని, భారతదేశం వ్యాప్తంగా ఈ ఘటనపై దృష్టి సారించిందని, జర్నలిస్టులపై జరిగే దాడులు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేవని వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయన్నారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయు) కార్యదర్శి సోమసుందర్ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పత్రిక స్వేచ్ఛపై దాడి కొనసాగుతున్నదని, తన మంత్రివర్గంతో కలిసి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రోజులను ఈరోజు సీఎంతో పాటు వారి మంత్రులు, ప్రజా ప్రతినిధులు మాట్లాడడానికి ఆరోజే బీజం పడిందని, ప్రమాణ స్వీకార బహిరంగ సభలో మూడు చానళ్లు, కొన్ని పత్రికల పేర్లు చెప్పి, ఎంత చూస్తా నేను బహిరంగంగా చెప్పడం నిదర్శనం అన్నారు. జర్నలిస్టులపై జరుగుతున్న వివక్ష, అసెంబ్లీ కవరేజీని నిషేధించడంపై స్పీకర్ను కలిసి కూడా అనేకమార్లు విన్నవించామన్నారు. అయినా వైసీపీ ప్రభుత్వం, జగన్ మనస్తత్వం మారలేదన్నారు. ఆ తర్వాత 2019లో 2340 జీవో తెచ్చి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే.. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని, కేసులు పెట్టాలని, కోర్టులకు ఈడ్చండని అందరు కలెక్టర్లు, ఎస్పీలు కమిషనర్లు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు ఆదేశించారన్నారు. అలాగే ప్రభుత్వ ప్రకటనలను ఈ నాలుగున్నరేళ్లలో వారు తమ అనుకూల పత్రికలకు ఇచ్చి, మిగతా పత్రికలకు నిలిపివేసి ఆర్థికంగా దెబ్బతీసే కుట్రను జగన్
అమలు చేశాడని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పదేపదే జాడుకులు దాడులు జరుగుతున్న ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన లేదని ఆందోళన వ్యక్తం చేశారు. హైపర్ కమిటీని కూడా రద్దుచేసి నిర్వీర్యం చేశారన్నారు. జర్నలిస్టులు తమ హక్కులను సమస్యలను చెప్పుకోవడానికి ఉన్న ఈ కమిటీని కూడా నాలుగున్నరలుగా పునరుద్ధరించకుండా ధ్వంసం చేశారన్నారు. జర్నలిస్టులపై వివక్ష, దాడులు జరిగితే చర్యలపై మహారాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో తెచ్చిన చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయకుండా తొక్కి పెట్టిందన్నారు.తర్వాత 2020, 2023లో చత్తీస్ ఘడ్ చట్టాన్ని తెచ్చిందన్నారు. ఇలాంటి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో తేవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, టిడిపి, జనసేన, ఏఐఎస్ఎఫ్, విద్యార్థి, యువజన, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ అసోసియేషన్లు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ధర్నా అనంతరం జర్నలిస్టులు కలెక్టరేట్ ఎదుట బయట నుంచి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు.