వారి కుట్రలు, కుతంత్రాలకు బెదరం
- ప్రజా సంక్షేమం, అభివృద్ధి వాళ్లకు పట్టదు
- వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీదే విజయం
- వైసీపీ వచ్చాకే అనంతలో అభివృద్ధి పరుగులు
- సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం ఉంది
- అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్పష్టీకరణ
———————————-+-+——–
కేపీ.కుమార్, ప్రత్యేక ప్రతినిధి ప్రజాభూమి, అనంతపురం
ప్రతిపక్ష పార్టీల ధ్యాసంత ముఖ్యమంత్రి కుర్చీపైనేనని, వారు
ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా బెదిరేది లేదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం ఉందని, వచ్చే ఎన్నికల్లోనూ (2024) వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని 14వ డివిజన్‌లో కార్పొరేటర్ అబూసాలెహా, మేయర్ మహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని వివరిస్తూ స్థానిక సమస్యలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ
2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉందని, ఆ పార్టీకి బీజేపీ, జనసేన పార్టీలు మద్దతుగా ఉన్నాయని అన్నారు. ప్రజలు టీడీపీకి అధికారం ఇస్తే, ఆ పార్టీ ప్రభుత్వం, నేతలు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించారని విమర్శించారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వమూ ఏ రాష్ట్రంలో అందించని రీతిలో సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే సాధ్యమైందని హర్షించారు. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ జరగని విధంగా రూ.600 కోట్లతో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేపట్టామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తమ దృష్టికి వస్తున్న సమస్యలకు పరిష్కారం చూపుతున్నామన్నామన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం ఉందనీ, 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అమరావతి కథలు చెప్పుకుంటూ కాలయాపన చేసిందని ధ్వజమెత్తారు. ఆ ఐదేళ్లలో ఎలాంటి సంక్షేమం, అభివృద్ధి జరగలేదు కాబట్టే, ప్రజలు తమ పార్టీని ఆదరించారని చెప్పారు. జగన్ నాయకత్వం వైపు ప్రజలు ఉన్నారని గ్రహించే, సదరు ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాయన్నారు. అందుకే అందరూ కలవాలని అంటున్నారని, ఎవరు కలిసినా తమకు వచ్చే నష్టం ఏమీ లేదని అన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిపై ప్రతిపక్ష పార్టీలకు చిత్తశుద్ది లేదని, కేవలం సీఎం సీటుపైనే వాళ్ల ధ్యాసంతా ఉందని చురకలంటించారు. అందుకే తరచూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, ఘర్షణ వాతావరణం కల్పించి రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటున్నారని విమర్శించారు. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం, కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే మంజూరైన పనుల్లో 70 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా పూర్తి చేస్తామన్నారు. పనులు చేపట్టే విషయంలో ఎక్కడా సమస్యలు లేదని, ఒకవేళ వచ్చినా, వాటిని అధిగమిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ చైర్‌పర్సన్ మంజుల, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు గౌస్‌బేస్, శ్రీనివాసులు, భూమిరెడ్డి జాహ్నవి, వక్ఫ్‌బోర్డు జిల్లా చైర్మన్ కాగజ్‌ఘర్ రిజ్వాన్, వైసీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, జేసీఎస్ కన్వీనర్లు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, లక్ష్మన్న, వైసీపీ బీసీ విభాగం రీజనల్ కో ఆర్డినేటర్ రమేష్‌గౌడ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, నగర అధ్యక్షురాలు కృష్ణవేణి, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా బేగ్, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎగ్గుల శ్రీనివాసులు, యువజన విభాగం నగర అధ్యక్షుడు వాసగిరి నాగ్, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.