జర్నలిస్టులకు కొత్తగా మంజూరు చేస్తున్న అక్రిడిటేషన్ల జారీలో తలెత్తుతున్న ఇబ్బందులు, సమస్యలను పరిష్కరించి అర్హులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఏపీయూడబ్ల్యూజే జిల్లా అడ్ హక్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గౌతమిని జర్నలిస్టులు కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. కొత్త అక్రిడిటేషన్ల ప్రక్రియలో అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో వేరువేరుగా కమిటీలు ఏర్పడ్డాయని, ఏ జిల్లాకు ఆ జిల్లాలో అక్రిడిటేషన్ల మంజూరు ప్రక్రియ జరుగుతోందని, అయితే కొత్తగా ఏర్పడ్డ జిల్లాలకు బ్యూరో ఇంఛార్జిలు, స్టాఫ్ రిపోర్టర్లు, కెమెరామెన్లు, వీడియో గ్రాఫర్లు (, వీడియో జర్నలిస్ట్స్), సబ్ ఎడిటర్లు గతంలో మాదిరే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వారే కొనసాగుతున్నారని కలెక్టర్కు వివరించారు. కనుక కొత్త అక్రిడిటేషన్ల మంజూరులో సదరు కేటగిరీ వారికి ఉమ్మడి జిల్లాలో చెల్లుబాటు అయ్యేలా కొత్త అక్రిడిటేషన్ లు మంజూరు చేయాలని కలెక్టర్ ను డిమాండ్ చేశారు. కొత్త అక్రిడిటేషన్ లు పంపిణీ చేసేవరకు పాత అక్రిడిటేషన్ లను రెన్యువల్ చేయాలని కోరారు. అర్హులైన జర్నలిస్టులు అందరికీ నిబంధనలను సడలించి అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కన్వీనర్ పయ్యావుల ప్రవీణ్, సభ్యులు చౌడప్ప, చలపతి, బ్యూరో ఇంఛార్జి లు భోగేశ్వర్ రెడ్డి, అక్బర్, శ్రీనివాసులు, నరేష్, సుసర్ల రమేష్, రాజా హొన్నూర్,
రామాంజినేయుులు, ప్రతిమ, కుమారస్వామి, గాజుల నాగభూషణం, రిపోర్టర్లు బి. మల్లేసు, తదితరులు పాల్గొన్నారు.