98 శాతం స్ట్రైక్ రేట్ కోసమే ఈ సీట్లు తీసుకున్నాం
పోటీ చేసిన ప్రతీ చోటా జనసేనను గెలిపించుకోవాలి
ఉండవల్లి: వచ్చే ఏపీ ఎన్నికల్లో జనసేన 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లే లెక్క అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులనే బరిలో నిలుపుతున్నామని తెలిపారు. జనసేనకి 60, 70 స్థానాలు కావాలని కొందరు అంటున్నారని చెప్పారు. అయితే గత ఎన్నికల్లో 10 స్థానాలైన గెలిచి ఉంటే ఎక్కువ స్థానాలు అడిగేందుకు అవకాశం ఉండేదని తెలిపారు. ఎక్కువ సీట్లు తీసుకుని ప్రయోగాలు చేసే కంటే..తక్కువ స్థానాలు తీసుకుని రాష్ట్ర భవిష్యత్ కోసం ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు.
జనసేనకు కేవలం 24 సీట్లేనా అని అనుకోవద్దంటూ పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి జనసేనాని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. చాలామంది పెద్దలు, పార్టీ నేతలు 40 – 50 చోట్ల పోటీ చేయాల్సిందేనని చెప్పారని గుర్తుచేశారు. అయితే, 24 అసెంబ్లీ సీట్లకు 3 పార్లమెంట్ సీట్లను కూడా కలుపుకుంటే మొత్తంగా రాష్ట్రంలోని 40 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లేనని పవన్ చెప్పారు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామనే ఆలోచన పక్కన పెట్టి, పోటీ చేసిన ప్రతిచోటా జనసేనను గెలిపించాలని పిలుపునిచ్చారు. 2019లో జనసేన కనీసం పది సీట్లైనా గెలుచుకుని ఉంటే ఇప్పుడు ఎక్కువ సీట్లను అడిగి తీసుకునే అవకాశం ఉండేదని పవన్ కల్యాణ్ చెప్పారు. జనసేన పోటీ చేసే 24 సీట్లను కేవలం ఓ నెంబర్ గానే చూడొద్దని అన్నారు. 98 శాతం స్ట్రైక్ రేట్ ఉండాలనే ఉద్దేశంతోనే టీడీపీ ఆఫర్ చేసిన 24 సీట్లతో సర్దుకుపోతున్నామని వివరించారు. పొత్తులో భాగంగా త్యాగాలకు పాల్పడిన కార్యకర్తలకు టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చిన అవన్నీ దాటుకుని టీడీపీ- జనసేన గెలుపునకు కృషి చేయాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీ, జనసేననే అని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు.