‘అతి సర్వత్ర వర్జయేత్’ అంటారు. ఏదైనా మోతాదుకు మించి తీసుకుంటే అది ప్రమాదకరమే. ఈ విషయం మరోమారు నిరూపితమైంది. ఆరోగ్యానికి మంచిదే కదా అని ప్రొటీన్లను అవసరానికి మించి తీసుకుంటే ధమనులు దెబ్బతినే ప్రమాదం ఉందని పిట్స్‌బర్గ్ యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ మెడిసిన్ అధ్యయనంలో తేలింది.ప్రొటీన్లు అధికంగా తీసుకోవడం వల్ల ధమనుల గోడల్లోను, వాటిచుట్టూ కొవ్వులు, కొలెస్ట్రాల్ చేరుతుందని అధ్యయనం గుర్తించింది. దీనివల్ల ధమనులు ఇరుకుగా మారి రక్త ప్రవాహాన్ని అడ్డుకోవడమో, లేదంటే అవి పగిలిపోయేలా చేయడమో చేస్తుందని, అది రక్తం గడ్డకట్టడానికి దారితీస్తుందని తేలింది. రోజూ ప్రొటీన్ల నుంచి తీసుకునే కేలరీలు 22 శాతానికి మించితే ధమనులపై ప్రతికూల ప్రభావం పడుతుందని అధ్యయనకారులు పేర్కొన్నారు.