బిడ్డ కవితను కాపాడుకోవడానికి కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారేమో..
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ది మూడో స్థానం: బండి సంజయ్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పూర్తి ఆధారాలను సేకరించిన తర్వాతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలిపారు. సీబీఐ, ఈడీ అనేవి స్వతంత్ర దర్యాప్తు సంస్థలని.. వాటి పని అవి చేసుకుంటూ పోతాయని చెప్పారు. కుంభకోణాల్లో సరైన ఆధారాలు ఉంటే… ఎంతటి పెద్దవారైనా ఉపేక్షించకూడదనేదే బీజేపీ విధానమని అన్నారు. తన బిడ్డ కవితను కాపాడుకోవడానికి కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారేమో అని వ్యాఖ్యానించారు. కవితపై ఆధారాలు ఉంటే చర్యలు తప్పవని అన్నారు. కరీంనగర్ లోని మహాశక్తి ఆలయాన్ని బండి సంజయ్ ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో తమకు పోటీ కాంగ్రెస్ పార్టీతోనే అని అన్నారు. బీఆర్ఎస్ ది మూడో స్థానమని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని… అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇదే ప్రచారం చేశారని… తాము కలిసి పోటీ చేశామా? అని ప్రశ్నించారు. దీనికి కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో రామరాజ్య పరిపాలన కొనసాగాలని బండి సంజయ్ ఆకాంక్షించారు. ప్రధాని మోదీ పాలనపై దేశ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ సారి బీజేపీ 370 సీట్లను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని విమర్శించారు. బీజేపీని ఓడించేందుకు రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని చెప్పారు.