ధైర్యం ఉంటే భూ అక్రమాలపై ఏ విచారణైనా చేయించు.. మేము సహకరిస్తాం..
- మా ప్రమేయం ఉంటే ఏ శిక్షకైనా సిద్ధం
- మా ప్రభుత్వంతో పాటు, మీ ప్రభుత్వ హయాంలో జరిగిన వాటి మీద కూడా విచారణ చేయించు
- విచారణ చేయించండని కలెక్టర్ కు మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం
- రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి మాజీ మంత్రి పరిటాల సునీత సవాల్ కేపీ.కుమార్, ప్రత్యేక ప్రతినిధి, ప్రజాభూమి అనంతపురం
“భూ అక్రమాలు.. భూ అక్రమాలు.. అంటూ ఎన్నిసార్లు చెప్పిందే చెబుతావ్.. ఎన్నిసార్లు అరిగిపోయిన రికార్డు వేస్తావ్..
ప్రభుత్వం మీది.. అధికారులు మీ చేతుల్లో ఉన్నారు.. ధైర్యం ఉంటే.. భూ అక్రమాలు జరిగి ఉంటే.. ఏ విచారణ అయినా చేయించు” అంటూ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే,
మాజీ మంత్రి పరిటాల సునీత ఫైర్ అయ్యారు. అనంతపురం రూరల్ పరిధిలోని ఉప్పరపల్లి, కురుగుంట, రాచానపల్లి, సోములదొడ్డి, ఇటుకలపల్లి, అక్కంపల్లి, కొడిమి పొలాల్లోని సర్వే నంబర్లలో టీడీపీ హయాంలో వేలాది మందికి ఫేక్ పట్టాలిచ్చారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు.. ఇదే అంశం మీద త్వరితగతిన విజిలెన్స్ అధికారులతో విచారణ చేయించాలని జిల్లా కలెక్టర్ ను కలసి ఫిర్యాదు చేశారు.. సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం మాజీ మంత్రి పరిటాల సునీత తీవ్రంగా స్పందించారు. ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి వచ్చి ఫేక్ పట్టాలిచ్చామని బురద చల్లడం కాదని, ధైర్యం ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ హయాంలో వాస్తవంగా నకిలీ పట్టాలిచ్చి ఉంటే, నాలుగేళ్లుగా ఏమి చేస్తున్నావని ఎమ్మెల్యే ను ప్రశ్నించారు. “ఈ రోజు అధికారంలో ఉన్న ప్రభుత్వం మీదే కదా.. విచారణ చేయించుకో.. ఎవరు వద్దన్నారు..? ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ కోరుతున్నావ్.. అవసరమైతే సీబీఐ చేత కూడా విచారణ చేయించుకో.. మేము కూడా సహకరిస్తామని” పరిటాల సునీత స్పష్టం చేశారు. అధికారులకు సహకరించేందుకు మండలంలో ఉన్న తమ పార్టీ కన్వీనర్లు కూడా వస్తారన్నారు. అది మానేసి ప్రతిసారి పరిటాల సునీత హయాంలో ఫేక్ పట్టాలిచ్చారంటూ ఆరోపణలు చేస్తూ బురద చల్లే పనిలో ఉన్నారన్నారు. టీడీపీ హయాంలో ఇచ్చిన పట్టాలు, అలాగే మీ ప్రభుత్వ హయాంలోని ఈ నాలుగేళ్లలో జరిగిన భూ అక్రమాలు, ఈ ప్రభుత్వం ఇచ్చినట్టుగా చెబుతున్న పట్టాల మీద కూడా విచారణ చేయించాలని సవాల్ విసిరారు. అలాగే జిల్లా కలెక్టర్ కు తాము కూడా విజ్ఞప్తి చేస్తున్నామని.. అనంతపురం రూరల్ పరిధిలో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్న వాటిపై విచారణ చేయించాలని కోరారు. ఇందులో మా తప్పు ఉందని తేలితే, తాము దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు. చేయాల్సిన పని వదిలేసి.. 24 గంటలూ పరిటాల కుటుంబం మీద పడి ఏడవటం మానేయాలని హితవు పలికారు.