ఎన్డీఎకి 400 సీట్లు గ్యారంటీ : ప్రధాని మోదీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వ అవినీతిపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విమర్శలు చేశారు. ఆయన శనివారం బెంగాల్‌లోని కృష్ణానగర్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. ‘టీఎంసీ అంటేనే అవినీతి. ఇక్కడికి వచ్చిన ప్రజలు ఇచ్చిన విశ్వాసంతో చెబుతున్నా.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే సర్కార్ 400 స్థానాల్లో విజయం సాధింస్తుంది. టీఎంసీ అంటే దౌర్జన్యాలు, కుటుంబ రాజకీయం, దోహానికి ప్రతిరూపం. బెంగాల్ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన పట్ల విసుగు చెందారు.ప్రతి పథకాన్ని స్కామ్‌గా మార్చారని, తమ స్కీములపై స్టిక్కర్ వేసి వారివని చెప్పుకుంటున్నారని అన్నారు.. తాము పేదలకు ఇచ్చే ప్రతిదానిని లాక్కోవడానికి వెనుకాడటం లేదన్నారు.‘మా, మాతి, మనుష్’ నినాదాన్ని ఉపయోగించి తృణమూల్ ప్రభుత్వం బెంగాల్ మహిళలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుందని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ మహిళలందరూ దీదీ పాలనా విధానంపై అసంతృప్తితో ఉన్నారన్నారు. సందేశ్‌ఖాలీకి చెందిన మహిళలు న్యాయం చేయాలని కోరుతూనే ఉన్నారని, అయినప్పటికీ ప్రభుత్వం వారి విన్నపాలను వినడంలేదని వివరించారు.. బెంగాల్‌లో, ఒక నేరస్థుడిని ఎప్పుడు అరెస్టు చేయాలో పోలీసులు నిర్ణయించరని అంటూ నేరస్థుడే ప్రతిదీ స్వయంగా నిర్ణయించుకుంటాడని చెప్పారు. మీరందరూ ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడకు రావడం చూసిన తర్వాత “ఎన్‌డిఎ సర్కార్, 400 సాధిస్తుందనే నమ్మకం పెరిగిందన్నారు మోదీ.. పశ్చిమ బెంగాల్‌లో గత 2 రోజులుగా విధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తున్నానని, వాటి ద్వారా ఇక్కడి ప్రజలకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయని అన్నారు. పశ్చిమ బెంగాల్‌కు తొలి ఎయిమ్స్ వస్తుందని తాను గతంలో చెప్పానని, అందుకు అనుగుణంగానే కొన్ని రోజుల క్రితం ఎయిమ్స్ ను ప్రారంభించానని గుర్తు చేశారు.రాబోయే సంవత్సరాల్లో, పెట్టుబడులు , ఉపాధి కోసం బిజెపి అసంఖ్యాక అవకాశాలను సృష్టిస్తుందని అంటూ దీని కోసం లోక్‌సభ ఎన్నికలలో ఓటు బిజెపికి వేయాలని కోరారు..బెంగాల్ ప్రజలు పేదలుగా ఉండాలని టిఎంసి కోరుకుంటుందని, తద్వారా వారి మురికి రాజకీయాలు కొనసాగించాలని భావిస్తున్నదని ప్రదాని అభిప్రాయపడ్డారు. అయితే తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో బెంగాల్ లోని మొత్తం 42 స్ధానాలలో విజయం సాధిస్తామని మోదీ చెప్పారు.