ఓ వైపు ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. కొన్ని రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోంది. మరోవైపు టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల పంపకాలు కూడా జరిగిపోయాయి. రెండు పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నాయి. అయితే బీజేపీతో ఈ పార్టీల పొత్తుపై ఇంత వరకు ఏమీ తేలలేదు. పొత్తు దిశగా బీజేపీ అధిష్ఠానం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ క్రమంలో పొత్తుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కీలక ప్రకటన చేశారు. ఒకవేళ పొత్తు ఉంటే తమ పార్టీ పెద్దలే ప్రకటిస్తారని పురందేశ్వరి చెప్పారు. తమ పార్లమెంటరీ కమిటీ సమీక్ష జరిపి తుది అభ్యర్థులను ఖరారు చేస్తుందని తెలిపారు. మేనిఫెస్టో కమిటీ నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నామని… త్వరలోనే మేనిఫెస్టోను ప్రకటిస్తామని చెప్పారు.
తాము మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశామని… తమ జాబితాను రెండు రోజుల్లో హైకమాండ్ కు పంపుతామని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి 2 వేల మంది వరకు అభ్యర్థులు వచ్చారని… వీరిని పరిశీలించి ఒక్కో నియోజకవర్గానికి మూడు నుంచి ఐదుగురు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశామని చెప్పారు.