లేపాక్షి : మండల పరిధిలోని మైదు గోళం గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై ఆదివారము రాత్రి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో 40 కేసుల కర్ణాటక మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సిఐ రాజశేఖర్ గౌడ్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తాము సిబ్బందితో కలిసి ఆదివారం అర్ధరాత్రి సమయంలో మైదు గోళం గ్రామ రహదారిలో వాహనాలను తనిఖీ చేస్తున్నామన్నారు. ఆ సమయంలో జైలో వా హనం అక్కడకు చేరుకోగానే దానిని ఆపి తనిఖీ చేస్తుండగా అందులోని ఇద్దరు వ్యక్తులు పరారు కాగా ఇద్దరినీ తమ ఆధీనంలోకి తీసుకున్నామన్నారు. అక్రమ మద్యం తీసుకు వస్తున్న జైలో వాహనం ఓ రాజకీయ నాయకుడికి చెందిందన్నారు. వాహనంతో పాటు కర్ణాటక మధ్యాన్ని స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సిఐ రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ, ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రాంతం నుండి విచ్చలవిడిగా కర్ణాటక మధ్యాన్ని ఆంధ్ర ప్రాంతంలోకి తరలిస్తున్న వారిపై ప్రత్యేక నిఘావేశామన్నారు. ఎవరికైనా విషయం తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ఆయన ప్రజలను కోరారు. అక్రమ మద్యం తరలించే వారు ఎంతటి వారైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అక్రమ మద్యం సరఫరా విషయంలో ప్రజలు అధికారులకు సహకరించాలని సెబ్ సిఐ రాజశేఖర్ గౌడ్ ప్రజలను కోరారు.