- నిర్భందాలతో విశాఖ ఉక్కు ఉద్యమాన్ని ఆపలేరు : రాజారెడ్డి
- కేపీ. కుమార్, ప్రత్యేక ప్రతినిధి, ప్రజాభూమి, అనంతపురము
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ ఆపాలని విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక చేపట్టిన రాష్ట్ర వ్యాప్త రాస్తారోకో కార్యక్రమాన్ని విచ్చిన్నం చేయడం ద్వారా విశాఖ ఉక్కు పరిశ్రమపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరి తేటటల్లం అవుతోందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రాజారెడ్డి విమర్శించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం అనంతపురంలో రాస్తారోకోకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉదయం 6 గంటలకే 4వ పట్టణ పోలీసులు రాజారెడ్డి ఇంటికి వెళ్లి ముందస్తు అరెస్టు చేస్తున్నట్లు చెప్పి గృహ నిర్భందం చేశారు. ఈ సందర్బంగా రాజారెడ్డి మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నాటకాలాడుతోందని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రయివేటీకరణ జపానికి జగన్ వంత పడటంతో ఆ విషయం స్పష్టమవుతోందని ఆరోపించారు. ప్రాణాలకు తెగించి పోరాడి సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, పోర్ట్, బీ ఎస్ ఎన్ ఎల్, జీవిత భీమా, విమానయానం లాంటి సంస్థలతో పాటు దేశ అంతర్గత భద్రతకు భంగం వాటిల్లేలాగా కీలకమైన రక్షణ రంగలో కూడా 100 శాతం పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా దేశ సంపదను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారని ద్వజమెత్తారు. నరేంద్రమోదీ, జగన్ మోహన్ రెడ్డి నాటకాలకు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని రాజారెడ్డి హెచ్చరించారు