Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలురైతులకు అండగా ఉండండి

రైతులకు అండగా ఉండండి

అకాలు వర్షాలు, పంటనష్టంపై పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబునాయుడు టెలీకాన్ఫరెన్స్ వివరాలు
ప్రజాభూమి ప్రతినిధి,అమరావతిః

రాష్ట్రంలో కురుస్తన్న అకాల వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నా వారికి అండగా నిలవడంలో జగన్ రెడ్డి విఫలమయ్యారని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో అకాలు వర్షాలు, పంట నష్టం, రైతులను ఆదుకోవడంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కష్టాల్లో ఉన్న అన్నదాతలకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 4,5 తేదీలలో ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించి రైతులకు భరోసా ఇవ్వనున్నారు.ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత పది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో 4 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలపై ముందస్తు సమాచారం, తగు ఏర్పాట్లు ప్రభుత్వం చేయకపోవడంతో రైతులు ఎక్కువగా నష్టపోయారు. ఏప్రిల్ 23 నుంచి కురుస్తున్న అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని వారిని కనీసం పరామర్శించిన దాఖలాలు లేవు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పంట నష్టం జరిగితే.. స్వయంగా సీఎంగా ఉన్న నేను, అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులను పరామర్శించడంతో పాటు వారికి అన్ని విధాలుగా అండగా నిలవడం జరిగింది. ఇప్పుడు రైతులను వారిమానాన వారిని గాలికి వదిలేశారు. వారికి సకాలంలో తగుస్థాయిలో నష్ట పరిహారం ఇవ్వడం లేదు, ధాన్య సేకరణ చేసి సకాలంలో నగదు చెల్లించడం లేదు. 5 ఏళ్ల కిందట ప్రారంభోత్సవం జరిగిన భోగాపురం ఎయిర్ పోర్ట్ ను తన సొంత ప్రచారం కోసం తిరిగి దాన్నే ప్రారంభోత్సవం అంటూ ఫుల్ పేజీ యాడ్ లకు ప్రభుత్వ ధనం భారీగా ఖర్చు చేస్తున్నారు. ఇవ్వాల్సిన అవసరం లేకున్నా కేవలం కమీషన్ల కోసం హిందూజాలకు, అమూల్ కు వేలకోట్లు ప్రభుత్వ ధనం ఇస్తున్నారు. ఈ దుబారా చేయకుండా రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు? కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో ధాన్యంతో పాటు మిరప, మొక్కజొన్న, పసుపు, శనగ, వేరుశనగ, మామిడి, అరటి, ఇతర ఉద్యాన పంటలు దెబ్బతిని రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. అకాల వర్షానికి ఆరబెట్టిన ధాన్యం తడిచి నష్టపోతే.. అది వ్యాపారుల పంట అని అసత్యాలు రాస్తున్నారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. కళ్లాల్లో ఆరబోసిన పంట దెబ్బతింది. రైతులకు గోనె సంచులు కూడా సరఫరా చేయలేని పరిస్థితుల్లో జగన్ రెడ్డి ఉన్నారు.కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పసుపు, మొక్కజొన్న రోజూ తడుస్తూనే ఉన్నాయి. ఓ వైపు అకాల వర్షాలు, మరోవైపు పండించిన పంటలకు మద్దతు ధర దక్కకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ లో కురిసిన అకాల వర్షాలకు కూడా 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పిడుగుపాటుకు గురై ఏడుగురు వరకు దుర్మరణం పాలయ్యారు. అసలు ఇప్పటివరకు ఎంత విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయో కూడా అంచనాలు రూపొందించకపోవడం జగన్ రెడ్డి నిర్లక్ష్య, రైతు రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనం. దీంతో రైతులు క్రాప్ హాలిడేలు ప్రకటిస్తున్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాక కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉంది. నాలుగేళ్లలో దాదాపు 3వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డా దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదు.
అకాల వర్షాలతో ఒక్కో రైతు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు నష్టపోయారు. పంట నష్టం అంచనాలు రూపొందించి తక్షణమే పరిహారం అందించాలి.
డిమాండ్లు

  1. నష్టపోయిన వరి, మొక్కజొన్న రైతుకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం అందజేయాలి.
  2. మిర్చి, అరటి, మామిడి రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించాలి.
  3. పిడుగుపాటు గురై మరణించిన కుటుంబాలకు ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందించాలి.
  4. అకాల వర్షాలకు దెబ్బతిన్న, రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. రబీ ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి.
  5. రైతులకు తగినన్ని నాణ్యమైన గోనె సంచులు సరఫరా చేయాలి
  6. తరుగు పేరుతో రైతుల్ని దోచుకోవడం అరికట్టాలి.
  7. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article