వేలేరుపాడు :ఆదివాసీలకు న్యాయం చేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తూ, ఈనెల 10న గిరిజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన మన్యం బంద్ విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కారం దారయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆ సంఘం ముఖ్య కార్యకర్తలతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసి నిరుద్యోగులకు 100% ఉద్యోగాలు, ఉపాధి కల్పన చూపించాలని డిమాండ్ చేస్తూ మన్యం బంద్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జీవో నెంబర్ మూడుకు చట్టబద్ధత కల్పించాలన్నారు. ఏజెన్సీ మెగా డీఎస్సీ వెంటనే నిర్వహించాలన్నారు. ప్రభుత్వాలు రాజకీయ లబ్ధి కోసం గిరిజనులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన నిరుద్యోగులకు ఏజెన్సీ ప్రాంతంలో దక్కల్సిన అవకాశాలను అడ్డుకోవడం సరైన చర్య కాదన్నారు. పోలవరం ముంపు వలన ఎక్కువగా నష్టపోతుంది గిరిజనులే అన్నారు. సర్వం త్యాగం చేస్తున్న గిరిజనులు కూడా ప్రభుత్వాలు న్యాయం చేయలేకపోయాయి అన్నారు.ఆదివాసీలు ఐక్యతతో పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయం ప్రభుత్వాలకు తెలిసేలా మన్యం బంద్ విజయవంతం కావాలన్నారు. ఈ సమావేశంలో రామవరం సర్పంచ్ పిట్ట ప్రసాద్, బంధం అర్జున్ పిట్ట వీరయ్య, కరటం వెంకటేశ్వర్లు, బంధం నాగేశ్వరావు, పిట్ట జయమ్మ తదితరులు పాల్గొన్నారు.