‘కలలకు రెక్కలు’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన నారా భువనేశ్వరి
ఉద్యోగాలు ఇచ్చే నాయకుడుకి ఓటు వేయండి
- సీమ నుంచి వలసలు ఆగాలంటే తెలుగు దేశం జనసేన ప్రభుత్వం రావాలి
- నేటి పాలకులు రాష్ట్రాన్ని దోచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు
-నారా భువనేశ్వరి
ప్రత్తికొండ:- ఆడబిడ్డల చదువులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా కలలకు రెక్కలు అనే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు నారా భువనేశ్వరి తెలిపారు. ఇంటర్ పూర్తి చేసుకుని పై చదువులకు వెళ్ళాలి అనుకునే విద్యార్ధినుల కోసం కలలకు రెక్కలు కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు భువనేశ్వరి తెలిపారు. ఈ పథకం కింద ప్రొఫెషనల్ కోర్సులు నేర్చుకునే విద్యార్ధినులకు ప్రభుత్వ గ్యారెంటీ తో బ్యాంక్ రుణాలు ఇప్పిస్తారు. విద్యార్థినులు బ్యాంక్ నుంచి పొందే రుణాలకు వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే చెల్లించేలా కార్యక్రమం ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ జనసేన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతుందని భువనేశ్వరి అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపి ఈ కార్యక్రమ బ్రోచర్ ను భువనేశ్వరి ఆవిష్కరించారు. ఆసక్తి ఉన్న విద్యార్థినులు కలలకు రెక్కలు.కామ్ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ప్రత్తికొండ నియోజకవర్గంలో పర్యటిస్తున్న నారా భువనేశ్వరి…మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువతతో సమావేశం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం కోసం, యువత తమ భవిష్యత్ కోసం టీడీపీ-జనసేనకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ….వచ్చే ఎన్నికలు ఇది మంచికి చెడుకి మధ్య జరిగే యుద్ధం, విధ్వంసానికి వ్యతిరేకంగా జరిగే యుద్ధం అని అన్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో పారదర్శకత లేని, అభివృద్ధి, సంక్షేమం ఇవ్వని నేతలను ప్రజలు ఎన్నుకున్నారని, దీని వల్ల రాష్ట్రం చాలా నష్టపోయిందని ఆమె అన్నారు. ప్రజల స్వేచ్ఛను లాక్కున్న ఆ పాలకుడు అధికారాన్ని తన ఆస్తి కూడబెట్టుకోవడానికి వాడుకున్నాడు అని విమర్శించారు. అతని పాలనలో ధనికులు ఇంకా ధనికులు అయ్యారు. కానీ పేద వాడు మరింత పేదవాడు అయ్యాడు అన్నారు. ఇలాంటి పేదల వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు.
యువత – మొదటి ఓటర్లు
మొదటి సారి ఓటు హక్కు వచ్చిన యువకులకు భువనేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు. మీ అమూల్యమైన ఓటు ను వినియోగించుకోవాలి అని చెప్పారు. మీ ఓటు మీ భవిష్యత్ ను నిర్ణయిస్తుంది అని చెప్పారు. ఒక మంచి నాయకుడిని ఎన్నుకునేందు మీ ఓటు హక్కుని వినియోగించాలి అని సూచించారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందాలని, ఓటు వేయాలని ఆమెసూచించారు. ఉద్యోగ అవకాశాలు సృష్టించి ఆర్థిక వ్యవస్థని మెరుగుపరిచే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడం మన బాధ్యత అన్నారు. ఇప్పటి నాయకులు సమాజాన్ని విభజించి పాలించడమే ధ్యేయంగా చేసుకున్నారు. తమ అక్రమార్జన మాత్రమే నేటి పాలకులకు ముఖ్యమైపోయిందని అన్నారు.చంద్రబాబు నాయుడు మన బిడ్డలకు ఉద్యోగాల గురించే ఎప్పుడూ చర్చించేవారు. ప్రగతి కోసం నిరంతరం శ్రమించేవారు. నైపుణ్యాలు పెంచి మంచి ఉద్యోగాలు వచ్చేలా చేశారు. 2014 నుంచి 2019 మధ్య కర్నూలు జిల్లాలో, పత్తికొండలో కూడా చంద్రబాబు ఎంతో అభివృద్దిచేశారు. సీమ ప్రాంతం సాగునీటిపై దృష్టిపెట్టారు. తెలుగు గంగ వంటి ప్రాజెక్టుల పనులు వేగవంతం చేశారు. ముచ్చుమర్రి లిఫ్ట్, పులకుర్తి లిఫ్ట్, సిద్దాపురం లిఫ్ట్, గోరకల్లు రిజార్వాయర్, అవుకు టన్నెల్, పులికనుమ లిఫ్ట్ ప్రాజెక్టులు పూర్తి చేశారు. ప్రపంచంలోనే మూడో పెద్ద సోలార్ పార్కు కర్నూల్ లో వచ్చేలా చేశారు. ఓర్వకల్లు ఎయిర్ పోర్టుని 18 నెలల్లో పూర్తి చేశారు. కర్నూల్ లో ఉర్దూ యూనివర్సిటీ, ఐఐఐటీ, ఓర్వకల్లు లో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేశారు అని కర్నూలు జిల్లాలో గత తెలుగు దేశం ప్రభుత్వం తెచ్చిన కర్యక్రమాలను వివరించారు.
కానీ నేటి ప్రభుత్వ పాలనలో రాయలసీమ యువత,ప్రజలు ఉపాధి కోసం వలస వెళుతున్నారని అన్నారు. ప్రజల జీవితాలు నేడు భారంగా మారాయి అన్నారు. ఇన్నీ చూసి లోకేష్ మిషన్ రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారని అన్నారు. తెలుగు దేశం ప్రభుత్వం వచ్చిన తరువాత కర్నూలు ని వ్యవసాయ పరికరాల ఉత్పత్తి కేంద్రంగా, వ్యవసాయ పరిశోధనలకు కేంద్రంగా మారుస్తాం అని అన్నారు. చిత్తూరుని ఎలక్ట్రానిక్స్ హబ్ గా, అనంతపూర్ ని ఆటోమొబైల్ హబ్ గా మారుస్తాం అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే…18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడ బిడ్డకి నెలకి రూ. 1,500, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్ధి కోసం ఏడాదికి రూ. 15,000 సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికీ ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం అని ప్రకటించారు. అందుకే ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా కొత్త ఓటర్లు ఈ విధంగా మనస్సాక్షి తో అడుగులు వేయాలి భువనేశ్వరి కోరారు. తెలుగుదేశం గెలిస్తేనే సామాన్యులు, పేదలకు న్యాయం జరగుతుంది అన్నారు. మీరు టీడీపీకి ఓటు వేయడం ద్వారా ఈ ధర్మ యుద్ధం లో పాల్గొని ఈ అరాచక పాలన పై పోరాడాలి.ధర్మాన్ని కాపాడాలి, శాంతిని తీసుకురావాలి అని భువనేశ్వరి పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అని అన్నారు.