-టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలి
-ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట
కదిరి :వైసీపీ ప్రభుత్వం రాక్షస పాలన తీసుకొచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసిందని కదిరి నియజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ విమర్శించారు. శుక్రవారం కదిరిలో జరిగిన శంఖారావం సభలో కందికుంట మాట్లాడారు. ఆయన మాటల్లోనే “వైసీపీ ప్రభుత్వం 4 సంవత్సరాల 8 నెలలు పరిపాలించి మరో 40 సంవత్సరాలు వెనక్కు తీసుకెళ్లింది. వైసీపీ గుండాల చేతుల్లో రాష్ట్ర ప్రజలు నలిగిపోయారు. ఇప్పటికైనా మనమందరం మేల్కొని తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అనంతపురం జిల్లా అన్నివిధాలా అభివృద్ధి చెందింది. జిల్లాకు హంద్రీనీవా సుజల శ్రవంతి పథకం కింద సాగునీరు తెచ్చింది చంద్రబాబే. కీయా పరిశ్రమ తీసుకొచ్చి జిల్లా వాసులకు 50 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈసారి ఎన్నికల్లో గ్రామస్థాయి నుండి కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా సైనికుల్లా పనిచేసి టీడీపీని గెలిపించాలి. టీడీపీ కార్యకర్తలపై ఉన్న అక్రమ కేసులకు ఎవరూ భయపడవద్దు. మన ప్రభుత్వం రాగానే అక్రమ కేసులు ఎత్తివేసేవిధంగా చర్యలు తీసుకుంటాము. దోపిడీ చేయలేదు, దొంగతనం చేయలేదు. అలాంటప్పుడు మనం కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. గత ఎన్నికల్లో నేను స్వల్ప మెజార్టీతో ఓటమి చవిచూశాను. ఈసారి అలాంటి పొరపాటు చేయకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. పార్టీ నాయకులకు శాశ్వతం కాదు. వస్తుంటారు.. పోతుంటారు. కానీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు శాశ్వతంగా ఉంటారు. మరో 40 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి. రైతు ఆరు నెలలు కష్టపడి పంట పండిస్తే, తీరా పంట చేతికొచ్చాక ఏదోవిధంగా నష్టపోతాడో, నాయకులు కూడా ఐదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడి ఎన్నికల సమయంలో నష్టపోకూడదు. అందుకని నాయకులు, బూత్ స్థాయి కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు చురుగ్గా వుండి టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు గురించి ముమ్మరంగా ప్రచారం చేయాలి. కదిరిలో టీడీపీని గెలిపించి చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి” అని కందికుంట ప్రసంగించారు.