-సూపర్సిక్స్ పథకాలతో అందరికీ న్యాయం -కదిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుంటా -టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
కదిరి :ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశారని, సచివాలయాన్ని తాకట్టుపెట్టిన ఈ దౌర్భాగ్య పాలనకు స్వస్తి చెప్పాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో నిర్వహించిన శంఖారావం సభకు లోకేష్ హాజరై మాట్లాడారు. ఆయన మాటల్లోనే “అనంతపురం జిల్లా అంటే మొదటి నుండి తెలుగుదేశం పార్టీకి అభిమానం. అందుకే అప్పట్లో నందమూరి తారక రామారావు హిందూపురం నుండి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. అనంతపురం జిల్లా మా పుట్టినిల్లు. పుట్టపర్తిలో సత్యసాయి బాబా ప్రశాంతి నిలయం, ధర్మవరం పట్టు చీరల పరిశ్రమలు, పెనుగొండ కియా కంపెనీ, కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉండడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టం. శివరాత్రి పండుగ రోజు అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఇంత పెద్ద సంఖ్యలో తరలిరావడం సంతోషంగా ఉంది. మండుటెండలో నిలబడి నా సభా ప్రసంగాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ప్రస్తుత జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయింది. సచివాలయాన్ని కూడా వదలకుండా తాకట్టుపెట్టి రాష్ట్ర ప్రజలకు మోసం చేశారు. సైకో చేసిన మోశాలే ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాయి. జగన్ ఎక్కడ సభలు నిర్వహించినా వారు చేసిన కార్యక్రమాలు గురించి చెప్పకుండా చంద్రబాబుపై బురదజల్లే మాటలే మాట్లాడుతున్నారు. అతనికి నిద్రలో కూడా చంద్రబాబు కనిపిస్తుంటారు. ఆయన గెలిస్తే పూర్తిగా మద్యపాన నిషేధం అన్నారు కానీ మద్యం ఎక్కడ చూసిన ఏరులై పారుతోంది. వైయస్సార్ చేయూత పథకం కింద 60 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తామని చెప్పి మోసం చేశారు. జగన్ డెవలప్మెంట్ అంటే నీకు తెలుసా? తెలుగుదేశం పార్టీ హయాంలో ఏమి అభివృద్ధి జరిగింది. మీ పరిపాలనలో ఏమి అభివృద్ధి జరిగిందనే విషయంపై మేము సిద్ధంగా ఉన్నాము. నువ్వు సిద్ధమా అని నేను సవాల్ విసురుతున్నాను. 75 వేల కోట్లు సబ్ ప్లాన్ నిధులు తప్పుద్రోవ పట్టించావు. బాబాయ్ ని చంపించిన నీవు ఇక రాష్ట్ర ప్రజలకు ఎలా అండగా ఉంటావు. 2019 ఎన్నికల్లో తల్లిని, చెల్లిని ఎన్నికల కోసం వాడుకుని ఇప్పుడు వాళ్ళని నడిరోడ్డుపై వదిలేశావు. వైసీపీ గుండాల అరాచక పాలన పోవాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టాల్సిందే. అందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు గడప గడపకు వెళ్లి ప్రజలకు తెలియజేయాలి. టిడిపి కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులు అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగిస్తాము. జగన్ గతంలో అక్రమ కేసుల్లో నిందితుడిగా చంచలగూడ జైలులో కాలం గడిపిన నువ్వు, ఇప్పుడు ప్రజల సమస్యల కోసం పోరాటాలు చేస్తున్న టిడిపి కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే మేము బెదరము. నిన్ను చూస్తే కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్ గుర్తుకొస్తాడు. ఎందుకంటే పచ్చ బటన్ నొక్కి పది రూపాయలు ఇస్తావు? ఎర్ర బటన్ నొక్కి వంద రూపాయలు లాక్కుంటావు. విద్యుత్ చార్జీలు, ఇంటి పన్నులు, పెట్రోల్, డీజిల్ ధరలు, వంటగ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు పదిరెట్లు పెంచేశావు. అదేవిధంగా అన్న క్యాంటీన్లు తొలగించి పేదల కడుపులు కొట్టావు. అరాచక పాలనపై ప్రశ్నిస్తే నాపై 22 తప్పుడు కేసులు పెట్టావు. ఇలాంటి చిల్లర కేసులకు నేను బెదరను. నీతి, నిజాయితీ పోరాటాల చేసేందుకు నేను తగ్గేదేలేదు. కదిరి పట్టణాభివృద్ధికి ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏమి చేయలేదు. భూగర్భ డ్రైనేజీ అన్నావు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టిస్తాం అన్నావు. ఇప్పటి వరకు ఏమీ చేయలేకపోయావు. నీవు మాత్రం అవినీతికి పాల్పడి ఆర్థికంగా బలపడ్డావు. అవినీతి పాలన పోయి ఇంకో 2 నెలలు ఓపికపడితే చంద్రన్న సుభిక్ష స్వరాజ్య పాలన వస్తుంది. సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతారు. బీసీలకు 10 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చే బాధ్యత మాదే. అలాగే బీసీలకు పర్మినెంట్ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు మంజూరు చేస్తాం. ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్న వారికి స్వగ్రామాల్లోనే ఉపాధి కల్పిస్తాం. సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలంటే ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి. క్లస్టర్ బూత్ యూనిట్లకు కిట్లు అందజేస్తాం.క్లస్టర్ యూనిట్ సభ్యులు ప్రతి ఇంటి తలుపు తట్టి వాటిని అందజేయాలి. ఈసారి అందరి ఆశీర్వాదాలు తెలుగుదేశం పార్టీకి కావాలి” అని లోకేష్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్, నాయకులు పార్థసారథి, అత్తార్ చాంద్బాషా, పల్లె రఘునాథరెడ్డి, వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, పర్వీన్ బాను, జనసేన పార్టీ నాయకులు భైరవ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.