టెస్టు క్రికెట్ కోసం ప్రత్యేక ఇన్సెంటివ్ లు ప్రకటించిన బీసీసీఐ
టెస్టు క్రికెట్ కోసం ప్రత్యేక ఇన్సెంటివ్‍లను బీసీసీఐ ప్రకటించింది. సంప్రదాయ ఫార్మాట్ ఆడే విధంగా ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత టీ20 యుగంలో టెస్టు క్రికెట్ ఆడేందుకు కొందరు ఆటగాళ్లు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఎక్కువగా ధనాధన్ ఫార్మాట్‍పైనే దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు యువ ప్లేయర్లు టెస్టు సిరీస్‍లపై ఎక్కువగా దృష్టి పెట్టడం లేదు. ఇది గుర్తించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టెస్టు క్రికెట్ ఆడేలా ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు “టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్క్రీమ్”ను ప్రవేశపెట్టింది. ఎక్కువ టెస్టులు ఆడే ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజుకు అదనంగా భారీ ప్రత్యేక ప్రోత్సహకాలను ప్రకటించింది.ఓ సీజన్‍లో 75 శాతం కంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‍లు ఆడిన ఆటగాళ్లకు.. ఒక్కో టెస్టుకు మ్యాచ్ ఫీజుకు అదనంగా రూ.45లక్షలను బీసీసీఐ చెల్లించనుంది. అలాగే, ఆ సీజన్‍లో 50 శాతం కంటే ఎక్కువ టెస్టులు ఆడిన ప్లేయర్లకు ఒక్కో టెస్టుకు రూ.22.5లక్షలను ఇన్సెంటివ్‍ను అదనంగా ఇవ్వనుంది. “సీనియర్ పురుషుల టీమ్ కోసం టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్ ప్రారంభిస్తున్నామని చెప్పేందుకు సంతోషిస్తున్నా. ఆటగాళ్లకు ఆర్థికపరమైన వృద్ధి, స్థిరత్వాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. 2022-23 సీజన్ నుంచి ప్రస్తుతం ఉన్న మ్యాచ్ ఫీజు రూ.15లక్షలపై అదనపు చెల్లింపుగా ఇది ఉంటుంది” అని జైషా ట్వీట్ చేశారు.ఇటీవలి కాలంలో కొందరు యువ ఆటగాళ్లు టెస్టు క్రికెట్‍పై విముఖంగా ఉన్నట్టు బీసీసీఐ దృష్టికి వచ్చింది. టీ20లు, లీగ్‍ల హవా కొనసాగుతుండటంతో వాటినే లక్ష్యంగా కొందరు ప్లేయర్లు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో టెస్టు క్రికెట్ ఆడేందుకు ప్రోత్సహించేలా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం ఒక్కో టెస్టుకు ప్రతీ ఆటగాడికి రూ.15లక్షల మ్యాచ్ ఫీజు ఉంది. సీజన్‍లో 75 శాతం టెస్టుల కంటే ఎక్కువగా ఆడితే.. మ్యాచ్ ఫీజుకు అదనంగా ఇన్సెంటివ్‍గా ప్రతీ మ్యాచ్‍కు రూ.45లక్షలు, 50 శాతం దాటితే అదనంగా రూ.22.5లక్షలు ఆటగాళ్లకు దక్కనున్నాయి. ఒకవేళ ఆ సీజన్‍లో 50 శాతం కంటే తక్కువ టెస్టులు ఆడితే.. ఆ ఆటగాడికి అదనపు ఇన్సెంటివ్ లేకుండా మ్యాచ్ ఫీజు మాత్రమే దక్కుతుంది. 2022-23 సీజన్ నుంచే దీన్ని వర్తింపజేస్తామని బీసీసీఐ కార్యదర్శి జైషా నేడు వెల్లడించారు.