అంగరంగ వైభవంగా శివపార్వతుల బ్రహ్మరథోత్సవం
లేపాక్షి: శిల్పకళారామంగా పేరొందిన లేపాక్షిలో శివపార్వతుల బ్రహ్మ రథోత్సవం భక్తజన సందోహం మధ్యన అంగరంగ వైభవంగా జరిగింది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లేపాక్షి ఆలయానికి వేలాదిగా ప్రజలు, పర్యాటకులు తరలివచ్చారు. భక్తజనుల శివనామస్మరణతో లేపాక్షిని హోరెత్తించారు. ఎవరి నోట విన్నా శివనామమే వినిపిస్తోంది. శనివారం ఉదయం ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి, వీరభద్రాలయం ధర్మకర్తల మండలి చైర్మన్ రమానందన్ ల నేతృత్వంలో ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహ శర్మ,, శ్రీనివాస్ కుమార్లు అభిషేకార్చనలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ఆగమికులు సునీల్ శర్మ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో రథసంప్రోక్షణ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం 11 దవనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు శివపార్వతుల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు ప్రజా ప్రతినిధులకు చైర్మన్ రామానందన్ శాలువతో సన్మానించారు. అనంతరం శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను ఉపవాస దీక్షతో బ్రాహ్మణులు బ్రహ్మరథం వరకు ఊరేగింపుగా హరినామస్మరణలతో తీసుకువచ్చారు. ఈ సందర్భంగా హరినామస్మరణలు ఆ ప్రాంతమంతా మారుమ్రోగాయి. ఆలయ కమిటీ చైర్మన్ పరమానందం బ్రహ్మరథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. బ్రహ్మరథం భక్తజన సందోహం మధ్యన క్రింది బస్టాండ్ నుండి భజన మందిరం వరకు కొనసాగింది. రథోత్సవ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా హిందూపురం రూరల్ సీఐ ఈరన్న లేపాక్షి ఎస్ఐ గోపీలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం మారు తేరుకు రమానందన్ ప్రత్యేక పూజలు నిర్వహించి భజన మందిరం నుండి క్రింది బస్టాండ్ వరకు వెనుకకు తీసుకు వచ్చారు. ఈ బ్రహ్మ రథోత్సవ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు, శివాజీ యువసేన బృందం, బహిరంగదళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.